Site icon NTV Telugu

Central Government: జనాభా నియంత్రణ కోసం త్వరలో చట్టం

Prahlad Singh Patel

Prahlad Singh Patel

దేశంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తేనుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలతో సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణపై ఎలా చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మీడియా ప్రశ్నించింది.

 

దీంతో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ జనాభా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే కేంద్రం ఎన్నో శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుందని.. జనాభా నియంత్రణ కోసం కూడా చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా దేశంలో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ఒక ముసాయిదా బిల్లును 2019లో ఎంపీ రాకేశ్ సిన్హా నామినేట్ చేయటంతో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శివసేన ఎంపీ అనిల్ దేశాయ్.. ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు-2020ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ అంశం ఇప్పటికీ పార్లమెంట్ పరిధిలోనే ఉండిపోయింది.

Exit mobile version