NTV Telugu Site icon

Cabinet Decisions: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. పీఎం శ్రీ పేరుతో దేశవ్యాప్తంగా మోడ‌ల్ స్కూళ్లు

Central Cabinet

Central Cabinet

Cabinet Decisions: కేంద్ర కేబినెట్‌ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం శ్రీ పేరుతో మోడ‌ల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ‌స్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థుల‌కు ప్రయోజ‌నం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర‌, స్థానిక ప్రభుత్వాలు న‌డిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను ఎంపిక‌ చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూత‌న జాతీయ విద్యావిధానం అమ‌లులో వీటిని ఆద‌ర్శంగా తీర్చిదిద్దాలని, అనుభ‌వాలు, ప్రాక్టీక‌ల్స్ ఆధారంగా విద్యాబోధ‌న‌కు ప్రాధాన్యత‌ ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ భావిస్తోంది.

రైల్వే ల్యాండ్‌ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్‌ క్లియర్‌ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్‌ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. అలాగే రైల్వే ల్యాండ్‌ లైసెన్స్‌ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్‌ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పీఎం గ‌తిశ‌క్తి కార్గో ట‌ర్మిన‌ల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఐదేళ్లలో 300 పీఎం గ‌తిశ‌క్తి కార్గో ట‌ర్మిన‌ల్స్ నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు. జేఎల్‌ఎన్‌ స్టేడియం నుంచి కక్కనాడ్ మీదుగా ఇన్ఫోపార్క్ వరకు కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-2కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 11.17 కిలోమీటర్ల పొడవు గల మెట్రో రైల్వే లైన్‌ కోసం 11 స్టేషన్ల ఏర్పాటు కోసం రూ.1,957.05 కోట్ల కేటాయింపుకు ఆమోదం లభించింది.

PM Narendra Modi: రేపు కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

పీపీపీ ప‌ద్ధతిలో రైల్వే భూముల‌ను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాల‌యాల ఏర్పాటుకు ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధ‌ర‌కు రైల్వే భూములు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణలో భాగంగానే కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్‌ తీసుకున్న రైల్వే లీజ్‌ నిర్ణయాలు.. నీతి ఆయోగ్‌ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్‌ 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్‌ లీజింగ్‌ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది.