ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకం ‘గోబర్‌ధన్ (GOBARdhan)’కు ఆమోదం లభించింది. ఈ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలు చేయనుండగా మొత్తం రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ భవిష్యత్ ఇంధన అవసరాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) కీలక పాత్ర పోషించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కేబినెట్ భేటీ తర్వాత కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, చెరకు పరిశ్రమల నుంచి వచ్చే ప్రెస్‌మడ్, మున్సిపల్ సేంద్రియ వ్యర్థాలు, ఇతర జీవ పదార్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రియ ఎరువు, గ్రామీణ ఆదాయం, ఆర్థిక విలువగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రి తెలిపారు. పరిశుభ్రమైన ఇంధన రంగంలో భారత్‌కు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ పథకం కింద కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి హామీతో కొనుగోలు, స్థిరమైన ధరలు, మూలధన సబ్సిడీ, పైప్‌లైన్ అనుసంధానం, రుణ సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. దీంతో దేశంలో సీబీజీ ఉత్పత్తి దాదాపు పది రెట్లు పెరగడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ పథకం ఇప్పటికే అమలులో ఉన్న SATAT, సేంద్రియ ఎరువుల మార్కెట్ అభివృద్ధి పథకం (MDA), బయోమాస్ అగ్రిగేషన్ మెషినరీ (BAM), పైప్‌లైన్ మౌలిక వసతుల అభివృద్ధి (DPI), జాతీయ బయోఎనర్జీ కార్యక్రమం కింద సీబీజీ ప్లాంట్లకు అందిస్తున్న కేంద్ర ఆర్థిక సహాయం (CFA) వంటి కార్యక్రమాలకు కొనసాగింపుగా అమలు కానుంది. ఈ పథకాల ద్వారా ఇప్పటికే దేశంలో 200కుపైగా సీబీజీ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఉత్పత్తి, కొనుగోలు వ్యవస్థలు, సేంద్రియ ఎరువుల విలువ శ్రేణి బలోపేతం కావడంతో పాటు వివిధ ప్రాంతాల్లో సీబీజీ వినియోగ సాధ్యత కూడా నిరూపితమైందని వివరించింది. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ఈ గోబర్‌ధన్ పథకం ద్వారా సీబీజీ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు మొత్తం వ్యవస్థను ఒకే జాతీయ విధానంలోకి తీసుకురానున్నారు. దీంతో పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలు, రుణ సౌకర్యాలు మరింత సులభతరం కానున్నాయి.
దేశంలో రవాణా, గృహ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో సహజవాయువు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సీబీజీ ఆ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం తెలిపింది. సహజవాయువుతో రసాయనికంగా సమాన లక్షణాలు కలిగిన సీబీజీని ప్రస్తుతం ఉన్న గ్యాస్ నెట్‌వర్క్‌లోనే వినియోగించవచ్చని పేర్కొంది. దీంతో దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. ప్రతి సీబీజీ ప్లాంట్ ద్వారా ముడి పదార్థాల సేకరణ, రవాణా, ప్లాంట్ నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపు వంటి అంశాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ పథకంలో మొత్తం ఆరు ప్రధాన భాగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సీబీజీ కొనుగోలుకు హామీ ఇవ్వడం ద్వారా నగర గ్యాస్ పంపిణీ సంస్థలు (CGD) సీబీజీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా 2026-27లో 3 శాతం, 2027-28లో 4 శాతం, 2028-29 నుంచి 5 శాతం వరకు సీబీజీ మిశ్రమ వినియోగాన్ని అమలు చేయనున్నారు. ఉత్పత్తిదారులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసా కల్పించేందుకు ప్రతి MMBTUకు రూ.2,110 పరిపాలనా ధరను కేంద్రం నిర్ణయించింది. ఈ ధర విధానం కనీసం 10 సంవత్సరాలపాటు అమల్లో ఉండనుంది.
కొత్తగా ఏర్పాటు చేసే గ్రీన్‌ఫీల్డ్ సీబీజీ ప్రాజెక్టులకు ప్రతి టన్ను సామర్థ్యానికి రూ.2 కోట్ల వరకు మూలధన సబ్సిడీ అందించనున్నారు. ముడి పదార్థాల సేకరణ, సేంద్రియ ఎరువుల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కూడా ఈ సహాయం వర్తిస్తుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు కూడా ఈ ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. అదే విధంగా సీబీజీ ప్లాంట్లను ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌లు, సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లతో అనుసంధానించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఎంఎస్‌ఎంఈల ఆధ్వర్యంలోని సీబీజీ ప్రాజెక్టులకు రుణ భరోసా పథకం తీసుకురావడంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు, కొత్త ప్రాజెక్టు అభివృద్ధిదారులకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇంకా CBG ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా జిల్లా స్థాయిలో ముడి పదార్థాల లభ్యత అంచనా, సేకరణ మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, సేంద్రియ ఎరువుల విలువ పెంపు, అవగాహన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఈ పథకం ద్వారా దేశ ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు పునరుత్పాదక గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుందని, శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయని, రైతులు, సహకార సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపు, సేంద్రియ ఎరువుల ఆర్థిక వ్యవస్థ విస్తరణకు కూడా ఈ పథకం దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది.

