MK Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘సనాతన’ వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రేపాయి. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలోని టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు నేరుగా ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించకుండా, ప్రతీ మతాన్ని గౌరవించాలని చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు సీఎం ఎంకే స్టాలిన్ నోరు విప్పారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ గురించి ఏం మాట్లాడారో తెలియకుండా ప్రధాని వ్యాఖ్యలు చేయడం అన్యాయం అని స్టాలిన్ అన్నారు. ఉదయనిధిపై వస్తున్న విమర్శలను తప్పుడు కథనాలుగా పేర్కొన్నారు. అణిచివేత గురించి ఉదయనిధి మాట్లాడిన మాటలను బీజేపీ అనుకూల శక్తులు సహించలేకపోతున్నాయని విమర్శించారు. ఉదయనిధి మారణహోమానికి పిలుపునిచ్చారని తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపించారు.
Read Also: Aditya-L1: ఆదిత్య ఎల్ 1 సెల్ఫీ.. భూమి, చంద్రుడు ఎలా ఉన్నారో చూడండి..
బీజేపీ సోషల్ మీడియా విభాగం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని.. ఉదయనిధి తమిళంలో కానీ ఇంగ్లీషులో కానీ ‘‘జాతి హత్య’’ అనే పదాన్ని వినియోగించలేదని, అయినప్పటికీ బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీకి చెందిన ఓ సాధువు తన కుమారుడి తలపై బహుమతి ప్రకటించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అతనిపై చర్యలు తీసుకుందా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని పేర్కొడం నిరుత్సాహపరిచిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఏదైనా నివేదికను తెలుసుకునేని, ధృవీకరించుకోవడానికి ప్రధాన మంత్రికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయని.. కానీ ఉదయనిధి గురించి తప్పుగా చేయబడుతున్న ప్రచారం గురించి ప్రధానికి తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..? అంటూ డీఎంకే చీఫ్ వ్యాఖ్యలు చేశారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనేది రాజకీయ జిమ్మిక్కు అని ప్రతిపక్ష కూటమిలో విభేదాలు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని స్టాలిన్ విమర్శించారు. సనాతన వివక్ష పట్ల బీజేపీకి పట్టింపు లేదని ఆయన అన్నారు.