Site icon NTV Telugu

Priyanka gandhi: నిరుద్యోగ సమస్యపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు

Priyankagandhi

Priyankagandhi

ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోటెత్తున్నారు. నోటిఫికేషన్లు వెలువడగానే జాబ్స్ కోసం ఎగబడుతున్నారు. ఆ మధ్య గుజరాత్‌లో హోటల్ ఉద్యోగం కోసం యువత ఎగబడింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఉద్యోగం కోసం వందలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో పెద్ద ఎత్తున తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై తన గళాన్ని వినిపించారు. కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రధాని మోడీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నమన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ‘ఎయిర్‌ ఇండియా’ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు నిరుద్యోగుల వెల్లువ ఘటనను ప్రస్తావిస్తూ.. ‘ఎక్స్‌’ వేదికగా మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

ఇప్పటివరకు ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించిందని ప్రధాని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. అవన్నీ అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఉపాధి కోసం నిరుద్యోగులు భారీగా తరలివెళ్లారన్నారు. ఈ పరిస్థితి దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతకు అర్ధం పడుతోందని విమర్శించారు. బూటకపు వాగ్దానాల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించొద్దని కోరారు. దయచేసి యువతకు కొత్త అవకాశాలు కల్పించండని కేంద్రాన్ని ఆమె కోరారు.

 

Exit mobile version