Site icon NTV Telugu

Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..

Al Falah University

Al Falah University

Al Falah University: ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మార్మోగింది. అరెస్టయిన డాక్టర్లకు కూడా ఈ వర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీలు, విచారణ అధికారుల కన్ను ఈ యూనివర్సిటీపై పడింది. దీని కార్యకలాపాలు, నిధుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..

ఇదిలా ఉంటే, అల్ ఫలాహ్ యూనివర్సిటీకి కేవలం 900 మీటర్ల దూరంలో ఒక అండర్ గ్రౌండ్ మదర్సా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ మదర్సా ఫరీదాబాద్‌లోని ధౌజ్‌లోని ఒక గ్రామానికి సమీపంలో పూర్తిగా ఒంటరి ప్రాంతంలో ఉంది. 4000-5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన ఈ మదర్సా ఉంది. ఇప్పుడు ఈ అసాధారణ నిర్మాణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మదర్సాకు సంబంధించిన 3 అడుగుల నిర్మాణం మాత్రమే పైన కనిపిస్తోందని, మిగతా భాగం భూగర్బంలో విస్తరించి ఉన్నట్లు తేలింది. సాధారణ మదర్సాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ మదర్సాను మౌలాన ఇష్తేయాక్ పేరుతో నమోదు చేశారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడకు కారణమైన ఉగ్రవాది ఉమర్ నబీ సహచరుల్లో ఒకరైన ముజమ్మిల్ షకీర్‌కు ఈ ఇష్తేయాక్ ఒక గదిని అద్దెకు ఇప్పించాడు. ముజమ్మిల్ విచారణలో ఇతడి పేరు బయటపెట్టడంతో అధికారులు ఇష్తేయాక్‌ను అరెస్ట్ చేశారు. మదర్సాకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి.?, దీనిని ఎవరు నడిపిస్తున్నారు అనే విషయాలపై విచారణ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version