UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!

  • ఐక్యరాజ్యసమితి కొత్త ప్రపంచ పటంపై వివాదం..
  • అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లపై వివాదాస్పద చిత్రీకరణ..
  • తీర్మానానికి మద్దతు ఉంది కానీ, తీర్మానం ద్వారా వచ్చిన మ్యాప్‌కు మద్దతు లేదన్న భారత్..
New World Map

New World Map

UN Map Controversy: ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్ సరిహద్దు బయట ఉన్నట్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ రెండు ప్రాంతాలు భారత్-చైనా సరిహద్దు వాదనల మధ్య వేర్వేరు ప్రాంతాలుగా ఉన్నట్లు కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి ‘‘కరెక్ట్ ద మ్యాప్’’ తీర్మానం తర్వాత ఈ కొత్త మ్యాప్ వచ్చింది.

ఇదే కాకుండా అరుణాచల్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని అస్సాం, చైనాలతో సరిహద్దు పంచుకునే స్వతంత్ర ప్రాంతంగా మ్యాప్‌లో తప్పుగా చూపించారు. అక్సాయ్ చిన్‌ను పశ్చిమ సరిహద్దు భారతదేశంలో, తూర్పు సరిహద్దును చైనాతో సరిహద్దు కలిగిన ఒక స్వతంత్ర ప్రాంతంగా చూపించారు. ఈ మార్పుల వెనక కారణాలను ఐక్యరాజ్యసమితి ఇంకా వివరించలేదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం మ్యాప్‌లో నియంత్రణ రేఖను (LoC) చుక్కల రేఖతో చూపించారు. భారత్, పాకిస్థాన్ మధ్య జమ్మూ కాశ్మీర్ తుది స్థితిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది.

వాస్తవ విస్తీర్ణాలను ప్రతిబింబించేలా కొత్త వరల్డ్ మ్యాప్ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 04న ఆమోదించింది. ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. అయితే, ఈ మ్యాప్ తీర్మానానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. తాము ఏదైనా నిర్దిష్ట మ్యాప్, మ్యాప్ ప్రొజెక్షన్‌ లేదా జాతీయ సరిహద్దు చిత్రీకరణను ఆమోదించడం లేదని స్పష్టం చేసింది. సమాన-విస్తీర్ణ ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే సూత్రానికే భారత్ మద్దతు ఇచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ మ్యాప్ తీర్మానానికి మద్దతు ఇచ్చింది, కానీ ఆ తీర్మానం ద్వారా వెలువడే సరిహద్దు మ్యాప్‌ను ఆమోదించలేదు.

జమ్మూ కాశ్మీర్, లడాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాలను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని, తప్పుదారి పట్టించేలా ఉండే మ్యాప్‌ను అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై భారత వైఖరి స్పష్టమైనదని, అందులో ఎలాంటి రాజీ లేదని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అక్సాయ్ చిన్‌తో సహా భారత్ తన భూభాగంగా పేర్కొంటుంది.