Ujjain Case: మధ్యప్రదేశ్ ఉజ్జయిని మైనర్ బాలిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అయితే అత్యాచార బాధితురాలు తనకు సాయం కావాలని కోరితే సాటి మనుషులు పట్టించుకోకపోవడం, అర్దనగ్నంగా, రక్తం కారుతున్నా 8 కిలోమీటర్లు నడిచి సాయం కోసం అభ్యర్థిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు బాలికను తరిమికొట్టడం వీడియోల్లో రికార్డైంది.
ఈ ఘటనలో ఓ పూజారి బాలిక పరిస్థితిని గమనించి కొత్త బట్టలు ఇచ్చి, విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనలో ఆ కేసులో ప్రధాన నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించినా పోలీసులు పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాధిత బాలిక చదువు, పెళ్లి బాధ్యతలను తీసుకోవడానికి ఓ పోలీస్ అధికారి ముందుకు వచ్చాడు. మహకాల్ పోలీస్ స్టేసన్ ఇన్‌చార్జ్ అజయ్ వర్మ బాలిక చదువు, వివాహ బాధ్యతలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తనకు చాలా మంది మద్దతు ఇచ్చారని, అన్ని బాధ్యతలను చక్కగా పూర్తవుతాయని నమ్ముతున్నానని ఆయన అన్నారు. బాలిక వేదన తన హృదయాన్ని కదిలించిందని, ఆ క్షణమే దత్తత తీసుకోవాలని అనుకున్నానని ఆయన అన్నారు. బాలికకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తానని తెలిపారు.