నటి త్రిషను ఉద్దేశిస్తూ ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో అరెస్టై, అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదలైన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను పోలీసులు ఉగ్రవాదిలా చూశారని ఆరోపించారు. మహిళలను అవమానించే ఉద్దేశంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యలో భాగమేనని ఆరోపించారు.
విడుదల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. మద్రాస్ హైకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వెల్లడించిన వైఖరికి, పోలీసులు వ్యవహరించిన తీరుకు పొంతన లేదని విమర్శించారు. తనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో చెప్పారని, కానీ విచారణ పేరుతో భారీ పోలీసు బలగాలను మోహరించి తనను చెన్నై నుంచి తంజావూరుకు రోడ్డు మార్గంలో తరలించారని ఆరోపించారు.
పోలీసు చర్యల సమయంలో తనతో సరైన రీతిలో వ్యవహరించలేదని కూడా ఆయన విమర్శించారు. తనను నేరుగా తంజావూరుకు తీసుకెళ్లకుండా ముందుగా సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. అక్కడ పలు గంటల పాటు తనను విచారించిన అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారని చెప్పారు. తనపై నమోదైన కేసు వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ప్రజలను ప్రభావితం చేస్తున్న కీలక సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఈ వివాదాన్ని ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
నటి త్రిషను ఉద్దేశిస్తూ తాను మహిళలను కించపరిచేలా లేదా అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని ఆరోపించారు. ఈ కేసు ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని టీవీకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఎంకే వర్గాలు విమర్శిస్తున్నాయి.
త్రిష వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు, విడుదల ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు మహిళలను అవమానించే వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నామని టీవీకే వర్గాలు చెబుతుండగా.. మరోవైపు ఈ కేసు రాజకీయ ప్రతీకార చర్యలో భాగమేనని డీఎంకే ఆరోపిస్తోంది. తాజా వ్యాఖ్యలతో డీఎంకే-టీవీకే మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

