Site icon NTV Telugu

Tamil Nadu: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. రేపే ప్రమాణస్వీకారం

Udhayanidhistalin

Udhayanidhistalin

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. ఉదయనిధిని ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు. ఉదయనిధి ప్రస్తుతం క్రీడల మంత్రిగా ఉన్నారు. ఉదయనిధికి శనివారం ప్రమోషన్ ఇస్తూ.. సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఉదయనిధితో గవర్నర్ ఆర్‌ఎన్. రవి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయనిధితో పాటు సెంథిల్‌ బాలాజీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఈ మేరకు రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది.

ఉదయనిధిని ఎప్పటి నుంచో ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డీఎంకేలో డిమాండ్ ఉంది. పలుమార్లు ఈ వార్తలు వినిపించినా ఉదయనిధి కొట్టిపారేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు పార్టీ శ్రేణుల కోరిక నెరవేరబోతుంది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు స్టాలిన్ హయాంలో కుమారుడు ఉదయనిధి కూడా డిప్యూటీ సీఎం కావడం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే శుక్రవారం ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కూాడా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మొత్తానికి ఢిల్లీ టూర్ తర్వాత కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చారు.

Exit mobile version