NTV Telugu Site icon

Maharashtra Elections: ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ మధ్య విభేదాలు..? సీట్ల పంపకంపై లొల్లి..

Maharashtra Elections

Maharashtra Elections

Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20న ఒకే విడతలో రాష్ట్రంలోని 288 స్థానాలకు పోలింగ్ నిర్వహించి, 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పింది. మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’, విపక్ష ‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’ మధ్య పోరు రసవత్తరంగా మారింది. హర్యానా ఎన్నికల విజయంతో బీజేపీ కూటమి ‘మహాయుతి’ మంచి జోరుపై ఉంది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్) ఎంవీఏ కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే ఉంది. ఎన్నికల ముందు ఠాక్రే శివసేన, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేతో సీట్ల పంపకంపై చర్చలు జరపబోమని తెలిపింది. అయితే, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే సేన, ఎన్సీపీ(శరద్ పవార్) ఎంవీఏ కూటమిలో 260 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్లు ఒక ప్రకటనైతే విడుదల చేసింది. శుక్రవారం శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మిత్రపక్షాలు కేవలం 200 సీట్లు మాత్రమే అంగీకరించాయని, నానా పటోలే పేరుని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నిర్ణయాలు తీసుకునే సమర్ధత లేదని విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, ఆ పార్టీ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాలతో మాట్లాడానని, ఆ రోజు తర్వాత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడతానని రౌత్ చెప్పారు.

Read Also: Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..

పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలను వేగవంతం చేయాలని, చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలే నిర్ణయాలు తీసుకోలేరు, వారు జాబితాను ఢిల్లీకి పంపాలి, ఆపై చర్చలు జరగాలి, నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇదే కాంగ్రెస్, ఠాక్రే శివసేన మధ్య విభేదాలకు కారణమైందని తెలుస్తోంది. శివసేన ప్రతిపాదనకు నానాపటోలే అంగీకరించలేదని సంబంధిత వర్గాల సమాచారం.

గత పార్లమెంట్ ఎన్నికల్లో 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 13 సీట్లను గెలుచుకుంది. విదర్భలో మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం, నానా పటోలేకి కంచుకోట కావడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను శివసేనకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలు మహావికాస్ అఘాడీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ.. మహాయుతికి మాత్రం సహకరిస్తుందని పోలిటికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.