తాజాగా “ట్విట్టర్” మరో వివాదంలో చిక్కుకుంది. ఓ “ట్విట్టర్” యూజర్ పోస్ట్ చేసిన తప్పుడు భారత్ చిత్రపటం పట్ల తీవ్ర ఆగ్రహం, ప్రతిస్పందనలు, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లడయ్యాయి. “ట్విట్టర్” వెబ్ సైట్ లోని “ట్వీప్ లైఫ్” విభాగం లో పోస్ట్ చేసిన భారత దేశ భౌగోళిక చిత్రపటం లో జమ్మూ కాశ్మీర్, లడక్ భారత్ దేశ అంతర్భాగం కానట్లుగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఆ పోస్ట్ లో ఉంది. దేశ చిత్ర పటాన్ని తప్పుగా చిత్రీకరించడం తీవ్ర నేరమని, కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కొత్త ఐ.టి నిబంధనలలో 69ఏ సెక్షన్ ప్రకారం “ట్విట్టర్” కు పెద్ద ఎత్తున జరిమానా విధించడంతో పాటు, బాధ్యులైన, సంబంధిత “ట్విట్టర్” అధికారులకు జైలు శిక్ష పడే అవకాశం, మరియు “ట్విట్టర్” పై నిషేధం కూడా విధించవచ్చని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
అయితే “ట్విట్టర్” వరుసగా అనేక తప్పులు చేస్తోందన్న ప్రభుత్వ వర్గాలు.. గతంలో కూడా “లే” భూభాగం జమ్మూ కాశ్మీర్ అంతర్భాగంగా, “లడక్” భూభాగం చైనా అంతర్భాగంగా అమెరికా సామాజిక మాధ్యమ దిగ్గజం “ట్విట్టర్” పేర్కొంది. భారత దేశ ప్రయోజనాలు, సున్నితమైన మనోభావాల పట్ల “ట్విట్టర్” పక్షపాత వైఖరి తో వ్యవహరిస్తోందని, గత కొన్ని నెలలుగా వస్తున్న విమర్శలను మరోసారి తన చర్యల ద్వరా నిరూపించుకుంది. బాధ్యతారాహిత్యంగా, తప్పుడు భారత దేశ భౌగోళిక చిత్రపటాన్ని “ట్విట్టర్” పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, భారత్ చట్టాలను “ట్విట్టర్” గౌరవించాలని ట్వీట్ చేసారు బిజేపి నేత మురళీధర్ రావు.
ఇక ఇటీవల పలు వివాదాలలో చిక్కుకున్న “ట్విట్టర్… అభ్యంతరకరమైన ట్వీట్ల ను, టాగ్ లను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసింది. దీంతో, ఢిల్లీ పోలీసులు
నోటీసులు జారీ చేసి ఢిల్లీ, గురిగావ్ లలో ఉన్న “ట్విట్టర్” కార్యాలయాలకు వెళ్లడం,“ట్విట్టర్” భారత్ అధిపతి మనీష్ మహేశ్వరిని బెంగుళూరు లో ప్రశ్నించడం జరిగింది. ఇటీవలే, ఉద్దేశపూర్వకంగా, మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ఉన్న ఓ వీడియో ను తొలగించనందుకు, విచారణకు రావాలని మనీష్ మహేశ్వరిని ఆదేశించారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.
