Meerut murder: మీటర్‌లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. విదేశాల్లో ఉండే సౌరభ్, తన 6 ఏళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి, 15 ముక్కలుగా చేసి, డ్రమ్ముల్లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు.
అయితే, ఈ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి, సౌరభ్ తల, చేతులను వేరే గదిలోకి తీసుకెళ్లి చేతబడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాహిల్ గదిలో వింతైన పెయింటింగ్స్, డ్రాగన్ బొమ్మలు, వింత చిహ్నాలు లభించాయి. దీంతో అతను చేతబడి వంటివి చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి గదిలో ఓ పిల్లి కూడా దొరికింది. అనేక బీరు సీసాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Read Also: Ireland: ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ.. ట్రంప్ హామీతో బరిలోకి!
సాహిల్ సౌరభ్ తల, చేతలను ముస్కాన్ ఇంటికి తీసుకువచ్చే ముందు, వీటిని తన గదిలోకి తీసుకెళ్లి ఏదో తాంత్రిక కర్మ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాతే ఇద్దరూ కలిసి శరీర భాగాలను డ్రమ్‌లో వేసినట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాలకు బానిసైన సాహిల్ అతీంద్రియ శక్తులను నమ్మేవాడని, ఇతరులతో చాలా అరుదుగా మాట్లాడేవాడని తేలింది. సాహిల్ ఎక్కువ సమయంలో ఇంట్లోనే గడిపేవాడని, తన ముసలి అమ్మమ్మతో ఎక్కువ సేపు ఉండేవాడని పోలీసులు తెలిపారు. సాహిల్ తల్లి చాలా క్రితమే చనిపోయింది, అతడి తండ్రి నోయిడాలో నివసిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సౌరభ్ లండన్ నుంచి భారీ మొత్తం డబ్బుతో ఇండియాకు వచ్చినట్లు ఆయన సోదరుడు బబ్లూ చెప్పాడు. బాలీవుడ్‌లో నటి కావాలనే ఆశతో ముస్కాన్ పలుమార్లు ఇంటి నుంచి పారిపోయిందని, దీని వల్ల దంపతుల మధ్య గొడవలు కూడా జరిగేవని ఆరోపించారు. 2021లో విడాకుల కేసు కూడా దాఖలు చేశాడని, కుటుంబం ఒత్తిడితో మళ్లీ పునరాలోచించుకున్నట్లు తెలిసింది. ముస్కాన్ సౌరభ్ డబ్బుతో ఒక ప్రాపర్టీని, ఐఫోన్‌ను కొనుగోలు చేశాడని బబ్లూ ఆరోపించాడు. సౌరభ్ తన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం భారతదేశానికి తిరిగి వచ్చాడని అతను చెప్పాడు. ఈ కుట్రలో ముస్కాన్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని, ఆమె కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బబ్లు ఆరోపించారు. ముస్కాన్ ప్రేమ వ్యవహారం, ఆర్థిక సమస్యలే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఆయుష్ విక్రమ్ తెలిపారు.