Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు

  • ట్విషా శర్మ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్
  • ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు
  • కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
Twisha Sharma Case1

Twisha Sharma Case1

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్‌లోని అత్తింట్లో మే 12న అనుమానాస్పద పరిస్థితుల్లో ట్విషా శర్మ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

భోపాల్‌లోని ప్రత్యేక కోర్టులో సోమవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. న్యాయవాది అయిన సమర్థ్ సింగ్, మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్‌ను నిందితులుగా పేర్కొంది. ట్విషా కుటుంబ సభ్యులు గతంలోనే వీరిద్దరిపై మానసిక వేధింపులు, శారీరక హింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

గర్భధారణపై అత్త ప్రశ్నలు

సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఏప్రిల్ 19న ట్విషా తన తల్లిదండ్రులతో అత్త గిరిబాల తన గర్భధారణ గురించి పదేపదే ప్రశ్నిస్తున్నారని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ‘‘ఎప్పుడు గర్భం దాలుస్తావు?’’ అని గిరిబాల అడిగినట్లు పేర్కొంది. తాను గర్భవతినైతే తప్పకుండా సమాచారం ఇస్తానని ట్విషా చెప్పినట్లు సీబీఐ తెలిపింది. అయితే తనకు ఇచ్చిన సమాధానంపై గిరిబాల ఆగ్రహం వ్యక్తం చేసి.. కుమారుడు సమర్థ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సమర్థ్ ట్విషాను మానసికంగా వేధించడంతో పాటు ఆమె గత సంబంధాలపై పదేపదే వ్యాఖ్యలు చేస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లు సీబీఐ పేర్కొంది.

గిరిబాల తనను రెచ్చగొట్టడంతో సమర్థ్ తన గత సంబంధాల పేరుతో తనను వేధించేవాడని ట్విషా తల్లిదండ్రులకు చెప్పినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. సమర్థ్ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని, అతడి ప్రవర్తన తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కూడా ట్విషా కుటుంబ సభ్యులతో చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

రూ.20 లక్షల పెట్టుబడులపై ఒత్తిడి

ట్విషాకు డీమ్యాట్ ఖాతా ఉందని, అందులోని షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ.20 లక్షలు ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ఈ పెట్టుబడుల గురించి తెలుసుకున్న తర్వాత గిరిబాల, సమర్థ్.. ఆ మొత్తాన్ని తమ ఉమ్మడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాలోకి బదిలీ చేయాలని ట్విషాపై ఒత్తిడి తెచ్చినట్లు సీబీఐ ఆరోపించింది. గిరిబాల, సమర్థ్ చర్యలన్నీ ఉమ్మడి ఉద్దేశంతోనే జరిగాయని, ఇవి ట్విషాపై జరిగినట్లు ఆరోపిస్తున్న మానసిక వేధింపుల్లో భాగమని సీబీఐ పేర్కొంది.

ఉద్యోగం కోసం ప్రయత్నం

సమర్థ్ బెంగళూరుకు వెళ్లిన సమయంలో భోపాల్‌లో గిరిబాలతో కలిసి ఉండేందుకు ట్విషా నిరాకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరింత మానసిక వేధింపులకు గురవుతాననే భయంతో ఆమె ఉద్యోగం కోసం నోయిడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 29న గురుగ్రామ్‌లో తన మాజీ యజమాని అమిత్ దాస్‌ను కలిసిన ట్విషా.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పినట్లు సీబీఐ తెలిపింది. భోపాల్‌లో అత్తింటివారి నుంచి ఎదురవుతున్న ప్రవర్తనతో తాను అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పినట్లు పేర్కొంది.

భోపాల్‌కు తిరిగి వచ్చిన తర్వాత ట్విషా తన తల్లికి పంపిన వాట్సాప్ సందేశాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. అందులో ‘‘అమ్మా.. నా జీవితం నరకంగా మారిపోయింది’’ అని ఆమె పేర్కొన్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. తనకు ఆందోళనగా ఉందని, సమర్థ్ తనతో మాట్లాడటం లేదని కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

గర్భధారణ.. అబార్షన్ నిర్ణయం

ఏప్రిల్ 30న సమర్థ్‌తో కలిసి ట్విషా బన్సల్ ఆసుపత్రికి వెళ్లి తన గర్భధారణ గురించి వైద్యులకు తెలిపింది. అనంతరం ఆమెను ఫీటల్ మెడిసిన్ నిపుణుడి దగ్గరకు రిఫర్ చేశారు. దర్యాప్తు ప్రకారం.. గర్భధారణను కొనసాగించడానికి ట్విషా ఆసక్తి చూపలేదు. అవసరమైన సమ్మతి తీసుకున్న అనంతరం ఆమె MTP (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) మాత్రలు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. అదే రోజు ఆమెకు మానసిక వైద్య కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. గర్భధారణను కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? అనే విషయంలో ఆమె అసౌకర్యంగా, అయోమయంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ట్విషా ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారని, డాక్టర్ సత్యకాంత్ తివారీ 10 రోజుల పాటు యాంటీ-యాంగ్జైటీ మందులు సూచించినట్లు సీబీఐ తెలిపింది.

ఉద్యోగం పోయిందని ఎగతాళి?

ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని ట్విషా తన తల్లిదండ్రులకు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఉద్యోగం పోవడంపై సమర్థ్ ఆమెను ఎగతాళి చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ‘‘నీకు ఇంగ్లిష్ కూడా మాట్లాడటం రాదు.. అందుకే ఉద్యోగం పోయింది’’ అని సమర్థ్ వ్యాఖ్యానించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. తనను ఎప్పుడూ నిఘాలో ఉంచుతున్నట్లు అనిపిస్తోందని కూడా ట్విషా తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏప్రిల్ 21న గిరిబాలకు ఫోన్ చేసి.. సమర్థ్ నుంచి ఎదురవుతున్న వేధింపులు, దురుసు ప్రవర్తనపై ట్విషా ఫిర్యాదు చేసినట్లు సీబీఐ తెలిపింది.

గత సంబంధాలపై పదేపదే ప్రశ్నలు

నసీరాబాద్‌లో ఉన్న సమయంలో ట్విషా గత మోడలింగ్, నటనా కెరీర్‌తో పాటు మరో వ్యక్తితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి గిరిబాల పదేపదే ప్రశ్నించినట్లు సీబీఐ పేర్కొంది. ఈ విషయంపై ట్విషా తల్లి, హర్షిత్ శర్మ అనంతరం ఆమె అత్తింటికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ట్విషా గత జీవితం, సంబంధాలపై పదేపదే ప్రశ్నించడం సరికాదని హర్షిత్.. గిరిబాల, సమర్థ్‌ను ప్రశ్నించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ట్విషా గత వృత్తి జీవితం, వ్యక్తిగత సంబంధాల గురించి పదేపదే ప్రశ్నించడం ఆమెకు మానసికంగా తీవ్ర ఇబ్బంది కలిగించిందని సీబీఐ పేర్కొంది. ఈ ఘటన అనంతరం భార్యాభర్తల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కపుల్స్ కౌన్సెలింగ్‌కు వెళ్లాలని ఇరు కుటుంబాల సమక్షంలో నిర్ణయించినట్లు తెలిపింది.

మృతికి కొద్ది రోజుల ముందు..

సీబీఐ ఛార్జ్‌షీట్‌లో అత్యంత కీలకంగా పేర్కొన్న అంశాల్లో మే 7న ట్విషా తన తల్లికి పంపిన వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయి. దర్యాప్తు ప్రకారం.. మే 6న గర్భధారణను ముగించేందుకు ట్విషా MTP మందుల తొలి డోస్ తీసుకుంది. అనంతరం మే 7 తెల్లవారుజామున 3:01 గంటల నుంచి 3:09 గంటల మధ్య ఆమె తన తల్లి రేఖారాణి శర్మకు వరుసగా వాట్సాప్ సందేశాలు పంపినట్లు సీబీఐ తెలిపింది. తనను భోపాల్ నుంచి తీసుకెళ్లేందుకు రావాలని ట్విషా తల్లిని కోరినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ‘‘అమ్మా.. రేపు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. సమర్థ్‌కు ఇక నేను అవసరం లేదనిపిస్తోంది. రేపు ఉదయం నాకు ఫోన్ చేయండి. నేను ఏం చేశానో కూడా నాకు అర్థం కావడం లేదు’’ అని ఆమె మెసేజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. అలాగే సమర్థ్ తనను ఏడాది కాలంగా భరిస్తున్నానని చెప్పాడని, తాను ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆమె పేర్కొన్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. తన కోసం టికెట్ చూడాలని, నేరుగా వచ్చే రైలు కూడా ఉందని తల్లిని కోరినట్లు తెలిపింది. ‘‘నువ్వు ఒక్కరే రా. మనిద్దరం కలిసి వెళ్లిపోదాం. ఇప్పటికి నాన్నను తీసుకురావద్దు. ఎవరికీ తెలియకుండా వెళ్లిపోదాం’’ అని కూడా ట్విషా తన తల్లికి చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.

వాట్సాప్ మెసేజ్‌లు, వైద్య రికార్డులు కీలకం

ట్విషా మృతి చుట్టూ జరిగిన పరిణామాలను వెలుగులోకి తీసుకురావడానికి వాట్సాప్ సందేశాలు, వైద్య రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర సాక్షుల స్టేట్‌మెంట్లను సీబీఐ కీలక ఆధారాలుగా పరిగణించినట్లు అధికారులు తెలిపారు. ట్విషా మే 12న భోపాల్‌లోని అత్తింట్లో మృతిచెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆమె మరణానికి ముందు ఎదుర్కొన్న పరిస్థితులు, కుటుంబ సభ్యులకు చెప్పిన విషయాలు, చివరి రోజుల్లో పంపిన సందేశాలు కేసులో కీలకంగా మారాయి.