తమిళనాడులో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగానాయక్ సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.
కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం గంగానాయక్ ఓ నాటక బృందాన్ని నడుపుతున్నారు. ఇందులో 50 మంది పనిచేస్తున్నారు. ఈ 50 మందిలో 30 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కరోనా సమయంలో తన నాటక బృందంతో కలిసి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గంగానాయక్ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో గంగా నాయక్ పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండటంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
