Site icon NTV Telugu

Jharkhand Video: జార్ఖండ్‌లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు

Train1

Train1

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. డియోఘోర్ జిల్లాలో గురువారం నవాదిహ్ రైల్వే క్రాసింగ్ దగ్గర లారీని రైలు ఢీకొట్టింది. దీంతో లారీ దాదాపు కింద పడిపోబోయింది. అక్కడే ఉన్న వాహనదారులపై పడబోయింది. దీంతో అప్రమత్తమైన వాహనదారులు దూరంగా పారిపోయారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం నవాదిహ్ రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు తెరిచి ఉంది. దీంతో వాహనదారులు అటు.. ఇటు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద లారీ కూడా వెళ్లే ప్రయత్నం చేసింది. ఇంతలోనే గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ వెచ్చేసింది. ఇంకోవైపు ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్న లారీని ట్రైన్ ఢీకొట్టేసింది. దీంతో రైలు కింద పడబోయింది. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు.. సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. దీంతో జసిదిహ్-అసన్సోల్ ప్రధాన మార్గంలో రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.

రైలు-ట్రక్కు ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అసన్సోల్ రైల్వే డివిజన్ ప్రతినిధి తెలిపారు. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. రెండు గంటల తర్వాత రైల్వే ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. దెబ్బతిన్న ఇంజిన్‌ను తొలగించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేయబడిన నలుగురు సభ్యుల కమిటీ, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version