Toxic Air Turns Deadly: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణాంకాలను సగటుగా తీసుకుంటే, ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2024లో శ్వాసకోశ వ్యాధుల వల్ల 9,211 మరణాలు నమోదయ్యాయి. ఇది 2023లో నమోదైన 8,801 మరణాలతో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల. ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా నిపుణులు గుర్తిస్తున్నారు. కాలుష్యభరితమైన గాలి, దుమ్ము, పొగ, వాహనాల ఉద్గారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధులు ఇక వృద్ధులకే పరిమితం కాకుండా పిల్లలు, యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
మరణాలకు ప్రధాన కారణంగా ప్రసరణ వ్యవస్థ వ్యాధులు నిలిచాయి. 2024లో గుండెపోటు, స్ట్రోక్, గుండె ఆగిపోవడం వంటి కారణాలతో 21,262 మంది మరణించారు. 2023లో ఈ సంఖ్య 15,714 మాత్రమే కావడం గమనార్హం. ఒకే ఏడాదిలో 5,500కిపైగా మరణాలు పెరగడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అసమతుల ఆహారం, కాలుష్యం వంటి అంశాలు దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక అంటు మరియు పరాన్నజీవుల వ్యాధుల వల్ల 2024లో 16,060 మరణాలు సంభవించాయి. ఇది 2023తో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ, కలుషిత నీరు, పేలవమైన పారిశుధ్యం, అధిక జనసాంద్రత కారణంగా ముప్పు ఇంకా కొనసాగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా 2024లో ఢిల్లీలో 1,39,480 మరణాలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,32,391గా ఉంది. మరణాల్లో 85,391 మంది పురుషులు, 54,051 మంది మహిళలు, 38 మంది ఇతర లింగాలకు చెందినవారు ఉన్నారు. వీటిలో 90,883 మరణాలు వైద్యపరంగా ధృవీకరించబడ్డాయి. మరణాల రేటు కూడా పెరగడం గమనార్హం. 2023లో వెయ్యి మందికి 6.16గా ఉన్న మరణాల రేటు, 2024లో 6.37కి పెరిగింది. మరోవైపు, 2024లో ఢిల్లీలో 3,06,459 సజీవ జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 8,628 తక్కువ. ఈ గణాంకాలు ఢిల్లీ ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభానికి స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
