NTV Telugu Site icon

Mini Moon: ఈ రోజు రాత్రి నుంచే చంద్రుడికి తోడుగా ‘‘మిని మూన్’’..

'mini Moon'

'mini Moon'

Mini Moon: భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే.. చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ‘‘మిని చంద్రుడు’’ కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ‘‘మిని మూన్’’ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతోంది. “2024 PT5” అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతాడు. ఆ తర్వాత సౌర కుటుంబంలోని సుదూరాలకు వెళ్తాడు.

దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3476 కి.మీ., మిని చంద్రుడి వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోపులతో చూడాల్సి వస్తుంది. అది కూడా తెల్లవారుజామున. 1.30 గంటల తర్వాత దానిని గుర్తించవచ్చు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు. మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమిస్తుంది. సెప్టెంబర్ 29 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరుగుతుంది.

Read Also: Tata Nexon EV Fire Case: టాటా నెక్సాన్ EV కేసు.. రూ. 19.55 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..

ఈ గ్రహశకలానికి హిందూ ఇతిహాసం ‘మహాభారతం’తో సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (RNAAS) యొక్క రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో, శాస్త్రవేత్తలు 2024 PT5 యొక్క కక్ష్య లక్షణాలు ‘‘అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్’’ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు.

అర్జున అనేది సౌరవ్యవస్థలోని గ్రహశకలాల ప్రత్యేక సమూహం . ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్. మెక్‌నాట్ 1991 నవంబర్ 1న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో ‘1991 VG’ అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్‌కి మహాభారతంలోని ప్రముఖ పాత్ర ‘అర్జున’ పేరుని పెట్టారు. దీనిని అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) అధికారికంగా ఆమోదించింది. హిందూ పురాణాల్లో అర్జునుడు తన ధైర్యసాహసాలకు, అసమానమైన విలువిద్య నైపుణ్యాలకు, జ్ఞానానికి ప్రసిద్ధి. అర్జునుడి బాణాల లాగే సౌరవ్యవస్థలో దూసుకెళ్లే లక్షణం కలిగిన గ్రహశకలాలకు ఉంది. అందుకే ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకుముందు 1997, 2013 మరియు 2018లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.