West Bengal: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ ఎమ్మె్ల్యే, ఫాల్తా నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న జహంగీర్ ఖాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని నేపాల్ సరిహద్దుల్లో అధికారులు అరెస్ట్ చేశారు. తనను తాను ‘‘పుష్ప’’గా అభివర్ణించుకున్న జహంగీర్ ఖాన్, ఎన్నికల ముందు బెంగాల్‌లో సంచలనంగా మారారు. పోలీసులను సవాల్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే, అరెస్ట్ అయిన అతడిని తప్పించేందుకు ఆయన భార్య కుట్ర పన్నినట్లు తేలండంతో శనివారం ఆమెను అరెస్ట్ చేశారు.
సరీనా బీబీని దక్షిణ 24 పరగణాల నుండి అదుపులోకి తీసుకున్నారు. ఖాన్‌ను విడుదల చేసేందుకు పన్నిన పథకం వెనుక ఆమె కీలక కుట్రదారురాలని పోలీసులు తెలిపారు.అరెస్ట్ తర్వాత అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫల్తాలో జూన్ 16న పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు గుమిగూడారు. నిరసనకారులు ఫల్తా పోలీస్ స్టేషన్‌కు నిరసనగా వెళ్లారు. ఈ నిరసనలకు బీబీ నాయకత్వం వహించిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) సిబ్బంది నిరసనకారులు స్టేషన్‌కు చేరుకోకముందే వారిని చెదరగొట్టారు. భద్రతా సిబ్బంది వెంబడిస్తుండగా నిరసనకారులు పారిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీబీ ఫల్తాలో నిరసనలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి బీబీతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. జూన్ 8న నేపాల్ సరిహద్దు సమీపంలో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఖాన్‌ను అరెస్టు చేశారు.

