Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!

Tiger Shroff Shooting

Tiger Shroff Shooting

Tiger Shroff Firing Case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల కేసులో అరెస్టయిన సోనిపట్‌కు చెందిన రేహన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడికి రూ.2 లక్షలు సంపాదించే అవకాశం కల్పిస్తామని ఆశ చూపి, అతడిని ఈ ఘటనలోకి లాగారని రేహన్ తల్లి ఆరోపించారు. దాదాపు 20 రోజుల క్రితం తన కుమారుడు ఇంట్లో రాత్రి భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి అతడిని పిలిచాడు. పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన రేహన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసినప్పటికీ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని ఆమె వెల్లడించారు. తన కుమారుడు ముంబైకి వెళ్లిన విషయం కూడా తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.2 లక్షల సంపాదన ఆశ చూపించారా?
రేహన్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు చేసిన పని తప్పేనని అంగీకరించారు. అయితే, అతడిని ఈ మార్గంలోకి తీసుకెళ్లిన వారిని కూడా గుర్తించి శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో, ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో కూడా తనకు తెలియడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని బీహార్‌కు చెందిన ఓ యువకుడు హామీ ఇచ్చినట్లు రేహన్ తల్లి ఆరోపించారు. తన సోదరుడి వద్ద పని ఇప్పిస్తానని, తద్వారా రూ.2 లక్షలు సంపాదించవచ్చని ఆశ చూపినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ హామీతోనే రేహన్‌ను తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరు, ఈ ఘటనలో అతడి పాత్ర ఏమిటనే అంశాలు ఇంకా విచారణలో తేలాల్సి ఉంది.

రేహన్ కొన్ని నెలల క్రితం చదువు మానేసి, గురుగ్రామ్‌లో వెల్డింగ్ పని నేర్చుకుంటున్నాడని అతడి తల్లి తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో ఏదైనా పని నేర్చుకుని కుటుంబానికి అండగా నిలవాలని అతడు భావించినట్లు చెప్పారు. కష్టపడి పనిచేసి తమ జీవితాలను మెరుగుపరుస్తాడని ఆశించిన కుమారుడు, ఇప్పుడు కాల్పుల కేసులో అరెస్టవడంతో కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. అంతే కాదు.. రేహన్ తల్లి ఆర్థిక పరిస్థితి ఈ ఘటనలో మరో విషాదకరమైన అంశంగా మారింది. తన కుమారుడిని కలిసేందుకు ముంబై వెళ్లాలన్నా తన వద్ద తగినంత డబ్బులు లేవని ఆమె వాపోయారు. కుమారుడు ఎక్కడ ఉన్నాడో, అతడి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

“నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే అతడికి శిక్ష పడాలి. అదే సమయంలో, అతడిని ఈ దారిలోకి నడిపించిన వారికి కూడా శిక్ష పడాలి” అంటూ ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.. అయితే, రేహన్‌కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తి ఎవరు? రూ.2 లక్షల సంపాదన ఆశ చూపించి అతడిని ముంబైకి తీసుకెళ్లారా? ఈ కాల్పుల ఘటనలో అతడి పాత్ర ఏంటి? రేహన్‌ను ఎవరైనా కావాలనే ఈ కేసులోకి లాగారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. రేహన్ తల్లి చేసిన ఆరోపణలు, ఉద్యోగం పేరుతో జరిగినట్లు చెబుతున్న ప్రలోభాలపై విచారణ అనంతరమే స్పష్టత రానుంది.