NTV Telugu Site icon

Salman Khan: ‘‘సల్మాన్ ఖాన్‌కి సహకరిస్తే చావే’’.. బాబా సిద్ధిక్ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..

Salman Khan

Salman Khan

Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో అతని కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో కాల్చి చంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఈ హత్య చేసిన ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.

ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్‌కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభమ్ రామేశ్వర్ లోంకర్‌గా భావిస్తున్న వ్యక్తి ఫేస్ బుక్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్నందునే సిద్ధిక్ హత్యకు గురయ్యాడని, సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నాడని పోస్టులో పేర్కొన్నాడు.

Read Also: Haryana Elections: కాంగ్రెస్ గెలిచే వాతావరణాన్ని సృష్టిస్తే, ఆయన నాశనం చేశాడు.. రైతు నాయకుడి సంచలన వ్యాఖ్యలు..

అంతే కాకుండా, గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్ థాపన్ పోలీస్ కస్టడీలో మరణించిన విషయాన్ని కూడా పోస్టులో ప్రస్తావించాడు. మే 1న ముంబై క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో థాపన్ శవమై కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు, అయితే అతని కుటుంబ సభ్యులు అతన్ని కస్టడీలో హింసించారని పేర్కొన్నారు.

‘‘మాకు ఎవరితో శత్రుత్వం లేదు, కానీ సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్‌కి ఎవరు సహాయం చేసినా, మీ లెక్కల్ని సవరిస్తాం’’ అని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. అయితే, ఈ పోస్టు ప్రామాణికతను పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. సిద్ధిక్ , సల్మాన్ ఖాన్ మంచి మిత్రులు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ మధ్య విభేదాలను పరిష్కరించడంలో సిద్ధిక్ మధ్యవర్తిత్వం వహించారు. 2013లో ఇఫ్తార్ విందులో ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు.

గత ఏడాది సల్మాన్ ఖాన్‌కి సన్నిహితంగా ఉన్న ఇద్దరు సెలబ్రిటీలపై బిష్ణోయ్ గ్యాంగ్ దాడి చేసింది. నవంబర్ 2023లో కెనడా వాంకోవర్‌లో పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్‌ ఇంటిపై కాల్పులు జరిపారు. గ్రేవాల్ సల్మాన్ ఖాన్‌ని ప్రశంసించినందుకు చావు భయాన్ని చూపినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ వాంకోవర్‌లో మరో పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి.

సల్మాన్ ఖాన్ ఎందుకు టార్గెట్..?

2022లో సిద్దూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ ఒక్కసారిగా ఫేమస్ అయింది. సెప్టెంబర్ 1998లో జోధ్‌పూర్‌ సమీపంలో మథానియాలోని బావాద్‌లో ఓ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ‘‘కృష్ణ జింకలను’’ కాల్చి చంపాడు. బిష్ణోయ్ సమాజం వీటిని అత్యంత పవిత్రంగా భావిస్తుంది.

లారెన్స్ బిష్ణోయ్ 2018లో కోర్టుకు హాజరైన సందర్భంగా.. “మేము సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్‌లో చంపుతాము. మేము చర్య తీసుకుంటే అందరికీ తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, వారు కారణం లేకుండా నాపై నేరారోపణలు చేస్తున్నారు.” అని అన్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సల్మాన్ ఖాన్ బాంద్రా గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను పెంచారు.

Show comments