NTV Telugu Site icon

Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని ఉరితీస్తాం.. ఎంపీ సీఎం వార్నింగ్..

Mp Cm

Mp Cm

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోమవారం మత మార్పిడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడుల కేసుల్లో మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ దీనిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కలిగి ఉందని అన్నారు. మైనర్లపై అత్యాచారానికి శిక్ష విధించినట్లే, బాలికల్ని మతం మార్చిన వారికి కూడా మరణశిక్ష విధించే నిబంధనల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు.

Read Also: Pakistan: కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం.. పాక్‌లో ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’

‘‘అమాయకమైన కూతుళ్లను అత్యాచారం చేసే వారిపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించారు. దీనికి తోడు మతమార్పిడులకు పాల్పడే వారికి కూడా మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టంలో మరణశిక్ష విధించే నిబంధనను కూడా ప్రవేశపెడతాము’’ అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆరిఫ్ మసూద్ తీవ్ర విమర్శలు చేశారు. స్వచ్ఛంద మతమార్పిడి రాజ్యాంగ హక్కు అని, చట్టం బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా ఉంటే, అది వివక్ష లేకుండా అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో లోపాలు ఉన్నట్లు సీఎం చెబుతున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ప్రతిపాదనల్ని చేస్తోందని ఆయన ఆరోపించారు.