Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!

  • ఆలయ ఊరేగింపు కోసం విమానాశ్రయం మూసివేత
  • తిరువనంతపురంలో 5 గంటలు విమానాలకు బ్రేక్
Thiruvananthapuram Airport

Thiruvananthapuram Airport

Kerala Airport to Halt Flights for Padmanabhaswamy Temple Procession: సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల వల్ల నిలిచిపోతుంటాయి. కానీ కేరళ రాజధాని తిరువనంతపురంలో మాత్రం ఒక పురాతన ఆలయ సంప్రదాయం కోసం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన సంప్రదాయ మతపరమైన ఊరేగింపుకు మార్గం కల్పించేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను ఐదు గంటల పాటు నిలిపివేస్తారు.

అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిపివేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన ‘అల్పాసి ఆరాట్టు’ ఊరేగింపు విమానాశ్రయ రన్‌వే మీదుగా సాగుతుంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే విమానాలకు ఈ తాత్కాలిక నిలిపివేత ప్రభావం చూపవచ్చు. నిర్ణీత సమయంలో విమానాల రాకపోకలు నిలిపివేయడంతో కొన్ని విమానాల రాక, బయలుదేరే సమయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానయాన సంస్థను సంప్రదించి తాజా షెడ్యూల్‌ను తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

ఏమిటీ అల్పాసి ఆరాట్టు సంప్రదాయం?

అల్పాసి ఆరాట్టు అనేది తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన సంప్రదాయ మతపరమైన వేడుక. ఈ సందర్భంగా ఆలయ విగ్రహాలను సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా శంఖుముఖం బీచ్‌కు తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు, పవిత్ర స్నానానికి సంబంధించిన ఆచారాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఊరేగింపులో ప్రత్యేకత ఏమిటంటే, దాని సంప్రదాయ మార్గం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మీదుగా సాగుతుంది. అందుకే ఈ పవిత్ర ఊరేగింపుకు మార్గం కల్పించేందుకు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తుంది.

1932 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం

తిరువనంతపురం విమానాశ్రయం 1932లో ప్రారంభమైంది. ఈ సంప్రదాయం అప్పటి ట్రావెన్‌కోర్ సంస్థాన పాలనతో ముడిపడి ఉందని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. అప్పటి రాజు శ్రీ చితిర తిరునాళ్ కాలం నుంచి ఆలయ ఊరేగింపుకు మార్గం కల్పించే ఆచారం కొనసాగుతున్నట్లు సమాచారం. సంవత్సరంలో రెండుసార్లు జరిగే ఆరాట్టు ఊరేగింపుల సందర్భంగా విమానాశ్రయ కార్యకలాపాల్లో మార్పులు చేస్తారు. ఆధునిక విమానయాన వ్యవస్థ, శతాబ్దాల నాటి మతపరమైన సంప్రదాయం ఒకే చోట కలిసిన అరుదైన ఉదాహరణగా ఈ ఆచారం నిలుస్తోంది. ఈ ఘటన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రత్యేక సాంస్కృతిక, మతపరమైన ఆచారాలను గుర్తుచేస్తోంది. విమానాశ్రయం వంటి కీలక రవాణా కేంద్రంలోనూ ఆలయ ఊరేగింపుకు మార్గం కల్పించడం ఈ సంప్రదాయం ప్రత్యేకతను తెలియజేస్తుంది.