Site icon NTV Telugu

Monkeypox: కలవరపెడుతోన్న మంకీపాక్స్‌.. టెన్షన్‌పెడుతోన్న కొత్త కేసులు

Monkeypox

Monkeypox

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ కేసులు… మనదేశంలోనూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. దేశ రాజధానిలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌ వచ్చింది. అతడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేకపోయినా… మంకీపాక్స్‌ సోకింది. తాజా కేసుతో కలిపి ఢిల్లీలో.. మంకీపాక్స్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది.

Read Also: CWG 2022: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం.. రజతం గెలుచుకున్న వికాస్‌ ఠాకూర్‌

మంకీపాక్స్‌ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు మృతి చెందగా.. కొత్తగా అక్కడ మరో వ్యక్తిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. జులై 27న యూఏఈ నుంచి కాలికట్‌ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తికి… మంకీపాక్స్‌ నిర్ధారణ అయింది. మలప్పురంలోని ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అతడితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులను మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల మంకీపాక్స్‌తో 22 ఏళ్ల వ్యక్తి మృతిచెందడంతో… త్రిస్సూరు జిల్లాలో 20 మందిని క్వారంటైన్‌లో ఉంచింది విజన్‌ సర్కార్‌. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి మొత్తం 10 మందితో మాత్రమే కాంటాక్టు అయినట్లు నిర్దారించింది. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ చెబుతోంది. మొత్తం కేసుల్లో… 5 కేసులు కేరళలోనే వెలుగు చూశాయి..

Exit mobile version