NTV Telugu Site icon

Indore: క్లీనెస్ట్ సిటీగా వరసగా ఏడోసారి ఇండోర్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సిటీలకు చోటు..

Indore

Indore

Indore: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Rajnath Singh: గల్వాన్‌తో భారత్ ఏంటో చైనాకు తెలిసొచ్చింది..

ఒక లక్ష కంటే తక్కువ జనాబా ఉన్న నగరాల్లో మహరాష్ట్రకు చెందిన సస్వాద్ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పటాన్, మహారాష్ట్రలోని లోనావాలా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వారణాసి బెస్ట్ క్లీనెస్ట్ గంగా పరివాహక పట్టణంగా నిలువగా.. దీని తర్వాత ప్రయాగ్ రాజ్ ఉంది. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ టాప్ ర్యాంక్ పొందింది.

ఈ ఏడాది ఇండోర్‌తో పాటు గుజరాత్ నగరం సూరత్ సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో నవీ ముంబై మూడోస్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నాలుగో స్థానంలో, విజయవాడ(6), తిరుపతి(8), హైదరాబాద్(9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి.