NTV Telugu Site icon

Parliament Attack: పార్లమెంట్‌పై దాడికి ప్లాన్-బి కూడా ఉంది.. విచారణలో సంచలన విషయాలు..

Parliament Attack

Parliament Attack

Parliament Attack: బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సంఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. అత్యంత భద్రత ఉన్న సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్‌లోకి వెళ్లి స్మోక్ కానస్టర్లను పేల్చడం ఆందోళన రేకెత్తించింది. 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగి డిసెంబర్ 13 తేదీ రోజునే నిందితులు ఈ ఘటనకు ఒడిగట్టారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్ తో పాటు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడిన నీలందేవి, అమోల్ షిండేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి లలిత్ ఝాలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Read Also: Rishi Sunak: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. పరిశీలిస్తున్న యూకే ప్రభుత్వం….

అయితే, ఈ దాడిలో తమ ప్లాన్ అమలు కాకపోతే ప్లాన్-బీ కూడా ఉన్నట్లు మాస్టర్ మైండ్ లలిత్ ఝా విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పాడు. ఏదైనా కారణాల వల్ల నీలం, అమోల్‌లు పార్లమెంట్‌కి చేరుకోకుంటే.. మహేష్, కైలాష్ అనే ఇద్దరు వ్యక్తలు పార్లమెంట్ చేరుకుంటారని, కలర్ బాంబులు పేల్చి, మీడియా ముందు నినాదాలు చేస్తారని లలిత్ ప్లాన్ చేశారు. ఈ ప్లాన్‌లో మహేష్, కైలాష్ అనే ఇద్దరు గురుగ్రామ్ లోని మరో నిందితులు విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంటికి చేరుకోలేకపోయారు. దీంతో పార్లమెంట్ వెలుపల ఉన్న నీలం దేశీ, అమోల్ షిండేలను కలర్ బాంబులు పేల్చాలనే ఆదేశాలు వెళ్లాయి. దీంతో ప్లాన్ – ఏ అమలు చేయడంలో నిందితులంతా విజయవంతమయ్యారు.

లలిత్ ఈ ఘటన తర్వాత నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు పట్టుకుని ప్లాన్ ప్రకారం ఎక్కడైనా దాక్కోవాలని ప్లాన్ చేశాడు. ఈ పథకం ప్రకారం.. రాజస్థాన్‌లో సాయం చేసే బాధ్యతను మహేష్‌కి అప్పగించినట్లు వెల్లడైంది. మహేష్ తన గుర్తింపు కార్డు ఉపయోగించి గెస్ట్ హౌజులో లలిత్‌కి బస ఏర్పాటు చేశాడు. లలిత్, మహేష్, కైలాష్ టీవీల్లో వస్తున్న సమాచారాన్ని నిరంతరం సేకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. లలిత్, మహేష్ ఇద్దరూ గురువారం రాత్రి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు.