Site icon NTV Telugu

Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో ‘‘మూడో మెట్టు’’ రహస్యం.. ఈ మెట్టుపై భక్తులు కాలు పెట్టరు..

'third Step' In The Puri Jagannath Temple

'third Step' In The Puri Jagannath Temple

Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో ఎన్నో రహస్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతీది దైవత్వాన్ని సూచిస్తుంది. ఒడిశాలోని పూరీలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పూరీకి చేరుకుంటారు. హిందూ మతంలోని చార్ ధామ్‌లలో ఒకటైన పూరీ అనేక పురాతన రహస్యాలను కలిగి ఉంది. వీటిలో ఆసక్తికమైనది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘‘మూడో మెట్టు’’ దీనిని ‘‘యమ శిల’’ అని కూడా పిలుస్తారు.

Read Also: Minister Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్.. లేఖ‌పై స్పందించిన మంత్రి

మూడో మెట్టు రహస్యం:

పూరీ జగన్నాథుడి ఆలయంలోకి ప్రవేశించడాన్ని ప్రతీ భక్తుడు కూడా పవిత్రంగా భావిస్తాడు. ఆలయంలో ప్రవేశించేందుకు 22 మెట్లు ఎక్కాలి. అయితే, దిగువ నుంచి మూడో మెట్టు ఇందులో చాలా ప్రత్యేకమైంది. దీనిని యమ శిల అని పిలుస్తారు. హిందూ మతంలో మరణదేవుడిగా పేరున్న యమ ధర్మరాజు నివాసంగా దీనిని నమ్ముతారు.

ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం, యమ రాజు ఒక సారి జగన్నాథుడిని దర్శించుకునేందుకు వస్తాడు. ఏ ఆత్మలు తన రాజ్యానికి రావడం లేదని స్వామి ముందు తన బాధను వ్యక్తం చేశాడు. జగన్నాథుడిని చూడటం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతున్నారని, యమలోకాని వెళ్లకుండా స్వామి చూసుకుంటాడని భక్తులు నమ్ముతారు.

ఈ నేపథ్యంలోనే యముడి బాధ విన్న జగన్నాథుడు, ఆలయ ప్రవేశ ద్వారంలోని మూడో మెట్టుపై నివసించాలని ఆదేశిస్తారు. నన్ను చూసిన తర్వాత ఈ మెట్టుపై అడుగు పెట్టేవాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు, కానీ మీ యమ లోకానికి వస్తాడు అని చెబుతాడు. అప్పటి నుంచి ఈ మెట్టును యమశిలగా పిలుస్తారు. భక్తులు జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాత ఈ మెట్టుపై అడుగు పెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. భక్తులు వారి పాదాలు మూడో మెట్టుపై పడకుండా దానిని దాటి వెళ్తారు.

భక్తులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు రాయిపై అడుగు పెడతారు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు అలా చేయకుండా ఉంటారు. జగన్నాథ ఆలయంలోని యమ శిల యొక్క ద్వంద్వ స్వభావం చాలా అసాధారణమైనది, ఎందుకంటే ఇది పాపాలను మాత్రమే కాకుండా పుణ్యాలను కూడా తొలగిస్తుంది.  అయితే, యమశిలను గుర్తించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. యమశిల మెట్టు ఇతర 21 మెట్ల మాదిరిగా కాకుండా స్పష్టంగా నలుపు రంగులో ఉంటుంది. దీంతో భక్తులు దీనిని సులభంగా గుర్తించవచ్చు.

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు జగన్నాథ ఆలయంలో యమ శిలపై అడుగు పెట్టడం ఆత్మను శుద్ధి చేస్తుందని, భక్తుడు జగన్నాథుని ఆశీర్వాదాలను పొందేందుకు అర్హులవుతాడని నమ్ముతారు. మరోవైపు, బయటకు వెళ్ళేటప్పుడు రాయిని నివారించడం వల్ల దర్శనం నుండి పొందిన పుణ్యాన్ని దక్కించుకుంటాడని భావిస్తారు. స్కంద పురాణం జగన్నాథ ఆలయంలోని యమశిలను ప్రస్తావించింది. బ్రహ్మపురాణం, ఇతర గ్రంథాల్లో కూడా ఈ మూడో మెట్టు ప్రస్తావన ఉంది.

Exit mobile version