NTV Telugu Site icon

Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. ఈ రోజు మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఆ తరువాత 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాదయాత్ర సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడుతలుగా పాదయాత్ర చేయనున్నారు.

Read Also: Karnataka hijab row: దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. రెండో రోజు పాదయాత్ర సమయంలో చిన్నారులతో మమేకం అయ్యారు. కన్యాకుమారి వీధుల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్ సభ, 42 అసెంబ్లీ స్థానానల్లో రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 29 వరకు కేరళలో యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాదాపుగా 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర జరగనుంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పాదయాత్ర చేయడం లేదని.. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.