Site icon NTV Telugu

ముంబాయిలో అందుబాటులోకి రానున్న వాటర్‌ ట్యాక్సీలు

ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇకనుంచి సరికొత్త రవాణాకు మహారాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైలు, బస్‌, విమానాలతో పాటు నాలుగో రవాణా సదుపాయంగా వాటర్‌ టాక్సీ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ప్రణాళికలను మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాటర్‌ ట్యాక్సీలను మూడు ఆపరేటర్‌ సంస్థలు నిర్వహించనున్నాయి. దక్షిణ ముంబయి నుండి నవీ ముంబయి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వాటర్‌ టాక్సీ సర్వీసుల లక్ష్యమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో గమ్య స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపింది. సుమారు 30 కి.మీల మధ్య ప్రయాణాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.

అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ ఎలిఫెంటాతో సహా డొమెస్టిక్‌ క్రూయిజ్‌ టెర్మినల్‌ (డిసీటీ) నుంచి రేవాస్‌, ధర్మతార్‌, కరంజాడే, డీసీటీ నుంచి బేలాపూర్‌, బేలాపూర్‌, నెరుల్‌, ఐరోలి, వాషి, ఖండేరి దీవులకు పలు రూట్‌లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపింది. నగరంలోని ప్రధాన వాణిజ్య జిల్లా అయిన నవీ ముంబయి నుండి సౌత్‌కి అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాటర్‌ టాక్సీలను నడపనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ముంబయి నుండి నవీ ముంబయికి రైలు మినహా మరే ఇతర రవాణా ప్రత్యామ్నాయం లేదని, దీంతో వాటర్‌ టాక్సీలు స్థానిక రైలు సర్వీసులపై భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా పనిచేస్తాయని తెలిపింది. డీసీటీ నుంచి నవీ ముంబయికి ఒక్కో ప్రయాణికుడు రూ.1200 నుండి రూ. 1500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే జెన్‌పిటికి సుమారు రూ. 750 ధర ఉంటుంది. భారీ వర్షాల సమయంలో కాకుండా ఏడాది పొడవునా ఈ ట్యాక్సీలను అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

https://ntvtelugu.com/nama-nageshwar-rao-asked-the-central-government-to-buy-telangana-grain/


Exit mobile version