ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కూడా క్షమాపణలు కోరారు. అయితే తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంపై ప్రధాని కమిటీ ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, “కనీస మద్దతు ధర”లో పారదర్శకత లాంటి అంశాలను కమిటీ చర్చించి నిర్ణయాలను సిఫార్సు చేస్తుందని ఆయన తెలిపారు.
అయితే కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని స్పష్టం చేశారు. ఈ చర్యతో రైతుల “కనీస మద్ధతు ధర” డిమాండ్ కూడా నెరవేరిందని ఆయన తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలని రైతు సంఘాలు డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరించిందని ఆయన వెల్లడించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత రైతుల ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదని, రైతులు తమ ఆందోళనను విరమించి తిరిగి ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరారు. నిరసన సమయంలో నమోదైన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదని, ఆ విషయాలపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని, పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.
