NTV Telugu Site icon

అసోం-మిజోరం మధ్య చల్లారని సరిహద్దు వివాదం

అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంచు భూమి వదులుకునేది లేదంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. ఆరు కంపెనీలకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు.. 306 జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

మిజోరం వెళ్లొద్దని.. తమ పౌరులకు సూచించారు అసోం సీఎం హిమాంత బిశ్వ. సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారే వరకు ఆ రాష్ట్రానికి ప్రయాణాలను నిలిపివేసుకోవాలని సూచించారు. మిజోరం ప్రభుత్వ వ్యవహారశైలితోనే బోర్డర్‌ వివాదం తలెత్తిందని అసోం ఆరోపిస్తోంది. మరోవైపు సరిహద్దు జిల్లాలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించింది మిజోరం. ఉద్రిక్త ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు బోర్డర్‌ ఇష్యూ.. కేసులు, నోటీసుల వరకు వెళ్లింది. సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెంచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ.. అసోం పోలీసులు మిజోరాం ఎంపీ వన్‌లాల్వెనకు నోటీసులు జారీ చేశారు. ఆగష్టు ఒకటిన విచారణకు రావాలని ఆదేశించారు.