Site icon NTV Telugu

Amit Shah: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదు.. మా పోరాటాన్ని కొనసాగిస్తాం!

Amith Shah

Amith Shah

Amit Shah: భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలనే సంకల్పంతో తమ సర్కార్ పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేసేందుకు మా బలగాలు గత పదేళ్లుగా కృషి చేస్తున్నాయి.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. డ్రగ్స్‌, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ టార్గెట్ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.

Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్‌

ఇక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36, 468 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్‌, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది అని పేర్కొన్నారు. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాశ్మీర్‌లో డ్రగ్స్, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందు కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అమిత్ షా వెల్లడించారు. అయితే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకుకేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.

Exit mobile version