NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీపై జర్మనీ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై కేంద్రమంత్రుల విమర్శలు..

Rahul

Rahul

Rahul Gandhi: రాహుల్ గాంధీ జైలుశిక్ష, అనర్హత వేటు గురించి జర్మనీ స్పందించింది. ఈ అంశాన్ని గమనిస్తున్నామంటూ ఆ దేశ విదేశాంగ శాఖ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో జర్మనీ కలుగజేసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. భారత అంతర్గత విషయాల్లోకి విదేశాలను ఆహ్వానిస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్రమంత్రులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also: 26/11 Mumbai Attack: ముంబై దాడి సూత్రధారులు “భారీ మూల్యం” చెల్లించాల్సిందే.. ఇజ్రాయిల్ వార్నింగ్..

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. భారత న్యాయవ్యవస్థపై విదేశీ జోక్యం సరికాదు, ఇకపై భారతదేశం విదేశీ జోక్యాన్ని సహించదు ఎందుకంటే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ అంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఇలా విదేశీ జోక్యాన్ని కోరడం అవమానకరం అని.. దేశంలోని ప్రజాస్వామ్యం, రాజకీయ, చట్టపరమైన పోరాటంపై రాహుల్ గాంధీకి నమ్మకం లేక విదేశీ శక్తుల జోక్యాన్ని కోరుతున్నారని మరోమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇది న్యూ ఇండియా అని, ప్రధాని మోదీ విదేశీ జోక్యాన్ని సహించరని ట్వీట్ లో పేర్కొన్నారు.

2019 పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయాడు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులోనే ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష పడింది.