NTV Telugu Site icon

Encounter: షోపియాన్ జిల్లాలో కాల్పుల మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter

Encounter

జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లో షోపియాన్‌ జిల్లాలోని కంజియులర్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కంజియులర్‌ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు జరగుతున్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతాబలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని వెల్లడించారు.

వారు లష్కరే తొయీబాకు చెందినవారని, వారిలో ఒకరు షోపియాన్‌కు చెందిన జాన్‌ మహ్మద్‌ లోన్‌గా గుర్తించామన్నారు. అతడు జూన్ 2వతేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితుడని వెల్లడించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వరుస కాల్పులు జరుగుతున్నాయి. వీటిలో చాలా మంది ఉగ్రవాదులు, కమాండర్లు అంతం అయ్యారు.

కాగా, సోమవారం రాత్రి శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు షోపియాన్‌ జిల్లాకు చెందినవారు. ఆ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.