NTV Telugu Site icon

Coimbatore Cylinder Blast : కోయంబత్తూర్ గ్యాస్ సిలిండర్ పేలుడులో ఉగ్ర లింకులు..

Coimbatore Cylinder Blast

Coimbatore Cylinder Blast

Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ ప్రారంభించారు.

పేలుడుకు పలు రసాయనాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 25 ఏళ్ల జమేషా ముబిన్ చనిపోయాడు. గతంతో 2019లో ముబిన్ ను ఎన్ఐఏ విచారించింది. ముబిన్ ఇంటిలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్, నాటు బాంబుల తయారీకి అవసరమయ్యే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాజాగా జరిగిన ఘటనలో ఓ మారుతి కారులో సిలిండర్ పెట్టే క్రమంలో ఈ సిలిండర్ పేలింది. కారును ఇప్పటి వరకు తొమ్మిది మంది పేర్ల మీదకు మార్చినట్లు గుర్తించారు.

Read Also: Cyclone sitrang: సిత్రాంగ్.. 12 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందా?

అయితే కోయంబత్తూర్ లో దీపావళి ముందు ఏదో కుట్రకు, దాడులకు పాల్పడేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముబిన్ ఇంటిలో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు డీజీపి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే కారులో సిలిండర్ పెట్టడం, దేవాలయం వద్దకు తీసుకువస్తున్న సమయంలో పేలడం కలకలం రేపింది. అయితే మరో నలుగురు యువకులు ఎవరనేది తెల్చే పనిలో ఉన్నారు పోలీసులు.

గతంలో కూడా కోయంబత్తూర్ సిటీలో ఉగ్రవాద దాడులు జరిగాయి. 1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూర్ వరస బాంబుదాడులతో ఉలిక్కిపడింది. మొత్తం 11 ప్రాంతాల్లో 12 పేలుళ్లు సంభవించాయి. 58 మంది మరణించగా.. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎల్కే అద్వానీని టార్గెట్ చేస్తూ ఈ దాడుల చేసేందుకు ఈ బాంబు దాడులు చేశారు ఉగ్రవాదులు.