Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!

  • భూగర్భ జలాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
  • నీటిమట్టాల తగ్గుదలపై అధికారులకు ఆదేశాలు
  • జల సంరక్షణకు తక్షణ ప్రణాళికలు
  • ఈ నెల 15న మోదీతో రేవంత్ భేటీ
El Nino

El Nino

రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావం , భూగర్భ జలాల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా దృష్టి సారించింది. సచివాలయంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూగర్భ జల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎస్‌ఐఆర్ – ఎన్‌ఈఐఎస్‌టీ (CSIR-NEIST) డైరెక్టర్, ప్రముఖ భూగర్భ జలాల నిపుణుడు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వీరేంద్ర ఎం. తివారీ కూడా పాల్గొని కీలక సూచనలు చేశారు.

ప్రధాని మోదీతో భేటీ.. కేంద్ర ఆర్థిక సాయం కోరతాం

ఈ నెల 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో తెలంగాణలో ఎల్‌నినో వల్ల ఏర్పడుతున్న పరిస్థితులు, దాని ప్రభావం గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. ఎల్‌నినో ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

భూగర్భ జలాల పర్యవేక్షణకు పక్కా ప్రణాళికలు

రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటిమట్టాలు క్రమంగా తగ్గుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలని, తద్వారా తక్షణ నివారణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) , భూగర్భ జలాల పెంపు కోసం తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానితో జరిగే సమావేశంలో ప్రస్తావించేందుకు వీలుగా జల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల నుంచి పలు సలహాలు, సూచనలను మంత్రి కోరారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.