కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శలు గుప్పించారు. రూ.600 కోట్ల నిధులతో మైనార్టీ కాలనీలు అభివృద్ధి చేయడమేంటి? అని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ‘‘పేదరికం, వెనుకబడిన స్థితి వంటి సామాజిక-ఆర్థిక ప్రమాణాల ఆధారంగా కాకుండా.. కేవలం మతం ఆధారంగా మైనారిటీ కాలనీలకు ప్రజా నిధులు కేటాయించడం ఏ రాజ్యాంగ నిబంధన కింద జరుగుతోంది?.’’ అని ప్రశ్నించారు.
ఈ పథకం రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం, భారత రాజ్యాంగంలోని 15వ అధికరణలకు విరుద్ధమవుతుందని పేర్కొన్నారు. ‘‘వ్యక్తులకు మతం ఉండొచ్చు. కానీ రోడ్లు, డ్రైనేజీలు, వీధులు, కాలనీలకు ఎప్పటి నుంచి మతం వచ్చింది? భౌగోళిక ప్రాంతాలకు మత గుర్తింపును ఇచ్చి.. ఆ ఆధారంగా ప్రజా డబ్బు ఖర్చు చేయడం రాజ్యాంగబద్ధమా? ఇది మత ప్రాతిపదికన గేట్టోరైజేషన్‌ను ప్రోత్సహించడం కాదా?” అంటూ నిలదీశారు.
‘‘నిజంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమైతే.. అదే విధంగా పేద హిందూ, దళిత, ఎస్సీ/ఎస్టీ, ఒబీసీ కాలనీలను ఎందుకు చేర్చడం లేదు?’’ అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని వెల్లడించారు.
కర్ణాటక కేబినెట్ గురువారం రూ.600 కోట్ల యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. 2026 నుంచి 2028 వరకు రాష్ట్రంలోని 11 నగర పాలక సంస్థల పరిధిలోని పలు కాలనీల అభివృద్ధిని ఈ పథకం కింద చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి.
ఇక ప్రభుత్వం.. ‘‘కర్ణాటక స్టేట్ ఎక్సైజ్ రీఫార్మ్స్ 2026’’ ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఈ విధానం మద్యం వినియోగానికి సంబంధించిన సామాజిక వ్యయాలను ప్రతిబింబించేలా ధరలను నిర్ణయించే లక్ష్యంతో రూపొందించబడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..మద్యం ద్వారా సంవత్సరానికి రూ.34,600 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ.. రోడ్డు ప్రమాదాలు, గృహ హింస, కాలేయ వ్యాధులు, మద్యం అలవాట్లు, కుటుంబ ఆదాయం నష్టం వంటి సామాజిక వ్యయాలు సుమారు రూ.51,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా.
కొత్త విధానంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత సరఫరా ట్రాకింగ్, డిజిటల్ లైసెన్సింగ్ సరళీకరణ, ఆరోగ్య హెచ్చరికల ప్రమాణీకరణ, కోటా విధానం బదులుగా రిజిస్ట్రేషన్ విధానం వంటి మార్పులను ప్రతిపాదించారు. అలాగే పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో మద్యం విక్రయాలకు పరిమితులు విధించే అంశం కూడా ఇందులో ఉంది.
