ఎరువుల కొరతపై కేంద్ర మంత్రిని ప్రశ్నించాడు.. వచ్చే ఎన్నికల్లో మా ఏరియాలో ఓట్ల అడగాలని సవాల్ విసిరాడు.. చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కర్ణాటక బీదర్ లోని హెడపురా గ్రామానికి చెందిన కుశాల్ పాటిల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎరువుల కొరత గురించి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహయమంత్రి భగవంత్ ఖూబాకు ఫోన్ చేశాడు. అయితే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషన వైరల్ గా మారింది. దీనిపై విచారించిన విద్యాశాఖ అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా కాల్ రికార్డ్ చేయడం వంటి ఆరోపణలపై పబ్లిక్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్‌స్ట్రక్షన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎరువుల కొరతపై కేంద్రమంత్రికి ఫోన్ చేసిన కుశాల్ పాటిల్.. తమ ప్రాంతంలో ఎరువుల కొరత నెలకొందని కేంద్రమంత్రి నోటీస్ కు తీసుకువచ్చాడు. అయితే కేంద్రమంత్రి దీనికి నేను ఏం చేయలేనని.. మీ ఎమ్మెల్యేను అడగండి, ఇప్పటికే రాష్ట్రానికి ఎరువులు పంపించానని సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా కుశాల్ పాటిల్, వచ్చే ఎన్నికల్లో తమ ప్రాంతం నుంచి ఓట్లు అడగాలని.. మరోసారి మీరు బీదర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నిక కాలేరని కేంద్రమంత్రికి సవాల్ విసిరారు. ఈ ఆడియో చాట్ వైరల్ కావడంతో విద్యాశాఖ కుశాల్ పాటిల్ ను సస్పెండ్ చేసింది. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని.. ఎరువులు అడినందుకు శిక్షించబడ్డానని.. గత సీజన్ లో కూడా ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దీని కోసమే కేంద్రమంత్రిని అడిగానని కుశాల్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
