Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..

Delhi Liquor Policy

Delhi Liquor Policy

Liquor Prices: మద్యం బాటిళ్లపై నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టాస్మాక్ దుకాణాల్లో వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సస్పెన్షన్లు ముమ్మరమైనట్లు సమాచారం.

మూడు రోజుల్లో 240 మందికి పైగా సస్పెన్షన్
అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, అసిస్టెంట్ సేల్స్‌మెన్‌లపై సస్పెన్షన్ వేట పడింది. కేవలం మూడు రోజుల్లోనే 240 మందికి పైగా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టాస్మాక్ దుకాణాలపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం బాటిళ్లపై ఎమ్మార్పీ కంటే అదనంగా నగదు వసూలు చేస్తే మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించనున్నట్లు అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. అదే తప్పును మరోసారి పునరావృతం చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది.

సస్పెన్షన్లపై టాస్మాక్ సిబ్బంది ఆందోళన
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన సస్పెన్షన్లపై కొన్ని ప్రాంతాల్లో టాస్మాక్ సిబ్బంది నిరసనకు దిగారు. షాపులు మూసివేసి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పు చేయకపోయినా తమను సస్పెండ్ చేస్తున్నారని కొందరు సూపర్‌వైజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను పరిశీలించకుండా చర్యలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. అయితే, మద్యం బాటిళ్లపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎన్నికల సమయంలోనే ప్రచార అంశంగా మారితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని భావిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి అదనపు వసూళ్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో టాస్మాక్ దుకాణాల్లో తనిఖీలు, సిబ్బందిపై చర్యలు మరింత వేగవంతమయ్యాయి.