Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!

  • తమిళనాట పొలిటికల్ సునామీ
  • డీఎంకే-ఏఐఏడీఎంకే పొత్తుపై ఉత్కంఠ
Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu Political Crisis: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) లేక అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీవీకేకి, విజయ్‌కు అధికారాన్ని దూరం చేయడానికి ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి.

విజయ్‌కు అగ్నిపరీక్ష
ప్రస్తుతం తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖలు సమర్పించారు. విజయ్ తన వద్ద ఉన్న 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు చూపించారు. అయితే స్పష్టమైన మెజారిటీకి 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని గవర్నర్ స్పష్టం చేయడంతో, విజయ్ మరికొంత సమయం కోరారు. విజయ్ స్వయంగా రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండటంతో, టీవీకే బలం సాంకేతికంగా 107కి తగ్గుతుంది. అంటే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం.

డీఎంకే – ఏఐఏడీఎంకే పొత్తుపై ఊహాగానాలు
విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దశాబ్దాలుగా ఉప్పూ నిప్పూలా ఉండే డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు చేతులు కలుపుతున్నాయనే వార్తలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను ఏఐఏడీఎంకే తీవ్రంగా ఖండించింది. మరోవైపు డీఎంకేతో పొత్తులో ఉన్న వీసీకే (VCK) పార్టీ విజయ్‌కు మద్దతు ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీసీకే తన కీలక సమావేశాన్ని రద్దు చేసుకోవడం గమనార్హం.

కాంగ్రెస్ మద్దతున్నా సందిగ్ధమే..
విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, మెజారిటీ మార్కును అందుకోవడం కష్టంగా మారింది. వామపక్ష పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) విజయ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాయి. మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, తాజా బలాబలాల లెక్కల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం విజయ్ చేస్తున్న పోరాటంలో ఇతర పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, డీఎంకే, ఏఐఏడీఎంకే నిజంగానే ఏకమవుతాయా, అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు యావత్ దేశం తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి.