Marriage of minor daughter for money in Tamil Nadu: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కర్కశంగా మారుతున్నారు. సొంత కూమార్తె అనే ధ్యాస లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మరికొంత మంది తమ కూతుర్లను డబ్బుల కోసం అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన సొంత కుమార్తె జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. డబ్బుల కోసం మైనర్ బాలికను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని ప్లాన్ చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
Read Also: Pawan Kalyan: పవన్ ధరించిన వాచీ విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి 13 ఏళ్ల కుమార్తెను డబ్బుల కోసం 32 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించాలని చూశాడు. బాలిక తల్లికి తెలియకుండా వివాహం తతంగాన్ని కానిచ్చాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలిక తండ్రి పరారీలో ఉండగా.. బాలికను పెళ్లి చేసుకున్న వరతరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరాశ్రయులైన మహిళా గృహంలో ఉన్న బాలికను మూడు నెలల క్రితం తండ్రి తీసుకెళ్లాడని పోలీస్ విచారణలో తేలింది.
అయితే, బాలిక తల్లి బాలికను పెరంబలూరులో గుర్తించింది.. తండ్రి, తన కూతురుకు వరతరాజ్ తో వివాహం జరిపించాలని చూశాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తండ్రి మద్యానికి బానిసకావడంతో.. అతని బలహీనతను గుర్తించిన వరతరాజ్ డబ్బులిచ్చి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. బాలిక తండ్రి, అతని సోదరి ముత్తులక్ష్మీలు కలిసి వరతరాజ్ తో పెళ్లికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం బాలిక తండ్రి, అతని సోదరి ముత్తులక్ష్మీ పరారీలో ఉన్నారు, వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం కింద వరతరాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
