Site icon NTV Telugu

TamilNadu CM: మణిపూర్‌ క్రీడాకారులకు అండగా తమిళనాడు సర్కార్‌

Tamil Nadu Cm

Tamil Nadu Cm

TamilNadu CM: మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో రావణకాష్టంలా హింసాయుత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు ఇప్పుడు ఒక్కొ్క్కటిగా బయటికొస్తున్నాయి. అయితే మణిపూర్‌లోని ప్రజలకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సంఘీభావం తెలపడమే కాకుండా తమ వంతు సహకారాలను అందిస్తున్నాయి. మణిపూర్‌ నుంచి వచ్చిన చిన్నారిని కేరళ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యను కొనసాగించడానికి సహాయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మణిపూర్‌లోని క్రీడాకారుకులకు తమిళనాడు ప్రభుత్వం అండగా ఉంటుందని. వారికి అవసరమైన శిక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రకటించారు.

Read also: Russia: రష్యాలో పేలిన హాట్ వాటర్ పైప్ లైన్.. నలుగురు మృతి

జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ఘర్షణల్లో పలుచోట్ల అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది. మణిపూర్‌ క్రీడాకారులకు కావాల్సిన శిక్షణను అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ‘‘ఖేలో ఇండియా, ఆసియా క్రీడలకు అవసరమైన శిక్షణ పొందేందుకు మణిపూర్‌ క్రీడాకారులకు ఆ రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు లేవని.. అందుకే వారిని మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని.. తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పర్యవేక్షణలో మణిపూర్‌ క్రీడాకారులకు అవసరమైన శిక్షణ అందిస్తామని సీఎం స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌ క్రీడాకారులకు అత్యున్నత స్థాయి నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చెప్పారు. ఛాంపియన్లను తయారుచేయడంలో మణిపూర్‌కు ఎంతో పేరుందని.. ముఖ్యంగా మహిళా ఛాంపియన్లను తయారు చేయడంలో ఆ రాష్ట్రం ఎప్పుడు ముందుంటుందని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. తమిళనాడులో శిక్షణ పొందాలనుకునే మణిపూర్‌ క్రీడాకారులు +91-8925903047 నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని లేదా తమ వివరాలను sportstn2023@gmail.comకు ఈ-మెయిల్‌ చేయొచ్చని తెలిపారు. 2024లో జరిగే ఖేలో ఇండియా క్రీడలకు తమిళనాడు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

Exit mobile version