Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • డీఎంకేపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
  • ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ క్లారిటీ
Congress Tvk Alliance

Congress Tvk Alliance

Congress TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న DMK – కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయ్ తన రాజకీయ ప్రయాణంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కామరాజ్ ఆశయాల నుంచి స్ఫూర్తి పొందడం విశేషమని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో రాజ్యాంగాన్ని రక్షించే లౌకిక ప్రభుత్వం ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని, బీజేపీ కనుసన్నల్లో నడిచే శక్తులు అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగా విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు పీసీసీని అధిష్టానం ఆదేశించింది.

డీఎంకేపై మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ప్రజాతీర్పు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. ప్రస్తుత క్యాబినెట్‌లో సగం మంది మంత్రులు ఓడిపోయారు. డీఎంకే వైఫల్యాల వల్ల మాకు సంబంధం లేకపోయినా మేం కూడా నష్టపోయాం. ఇప్పుడు బీజేపీ కన్ను తమిళనాడుపై పడింది. ప్రజలు తిరస్కరించిన వారి పక్షాన ఉండాలా? లేక బీజేపీని అడ్డుకునే శక్తితో చేతులు కలపాలా? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది” అని రాసుకొచ్చారు.

ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ క్లారిటీ
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ అంశంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పందిస్తూ.. టీవీకే నుంచి తమకు లేఖ అందిందని ధృవీకరించారు. తమకు మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరినట్లు గవర్నర్ తెలిపారు. ఈ సాయంత్రం విజయ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ అయిన టీవీకే అనూహ్య రీతిలో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పార్టీలు సాధించిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.. TVK (విజయ్)108, DMK 59, ADMK 47, కాంగ్రెస్ 05, ఇతరులు 08. మొత్తానికి డీఎంకే అధికారాన్ని విజయ్ నేతృత్వంలోని టీవీకే కూల్చివేసి, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.