School Reunion Turns Tragic: స్కూల్ రీయూనియన్‌లో పరిచయం.. ప్రేమ, అనుమానం, అసూయతో డబుల్ మర్డర్..!

School Reunion Turns Tragic

School Reunion Turns Tragic

School Reunion Turns Tragic: పాఠశాల రోజుల్లోని స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే ఆ బంధంలో అనుమానాలు, అసూయలు చోటుచేసుకోవడంతో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. తనతో సన్నిహితంగా ఉండటం లేదని భావించిన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరినీ కిరాతకంగా హత్య చేసిన ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో నిందితుడిని సంజయ్ గాంధీగా గుర్తించారు. తిరువణ్ణామలై జిల్లాలోని ఓ పాఠశాలలో మాలిని, సంజయ్ గాంధీ కలిసి చదువుకున్నారు. గతేడాది జరిగిన స్కూల్ రీయూనియన్‌లో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నట్లు తెలిపారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల మాలిని సంజయ్ గాంధీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తి రంజిత్ కుమార్‌కు దగ్గరవుతోందని సంజయ్ అనుమానించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర అసూయకు లోనైన నిందితుడు ఇద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.

మాలిని, రంజిత్ కుమార్ ఇద్దరూ బంధువులని సమాచారం. వీరిద్దరూ ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో వారిని వెంబడించి నిందితుడు వారిపై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట హత్యల కేసులో సంజయ్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అసూయే హత్యలకు కారణమై ఉండొచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ జంట హత్యల ఘటన తమిళనాడు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.