CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం

Cm Vijay

Cm Vijay

CM Vijay: డీలిమిటేషన్ వ్యవహారంపై దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.. ఎన్డీఏ పక్ష పాలిత రాష్ట్రాలు తప్ప.. మిగతా రాష్ట్రాలు మొత్తం.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి.. అయితే, డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543గానే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా వెంటనే డీలిమిటేషన్ చేపట్టవద్దని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ అన్యాయం జరగకుండా చూడాలని సీఎం విజయ్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం కలగకూడదని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడటంతో పాటు రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని విజయ్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అంశాన్ని వచ్చే ఎన్నికల రాజకీయాలతోనూ ముడిపెట్టిన ఆయన.. రాష్ట్ర హక్కుల విషయంలో అన్ని పార్టీలు కలసి పనిచేయాలని కోరారు.

మహిళా రిజర్వేషన్‌పై కూడా కీలక డిమాండ్లు
మరోవైపు, మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా సీఎం విజయ్ అసెంబ్లీలో తన వైఖరిని స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ కల్పించాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు మహిళా రిజర్వేషన్‌ను వాయిదా వేయకూడదని విజయ్ స్పష్టం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ను రెండు వేర్వేరు అంశాలుగా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

డీఎంకే, అన్నాడీఎంకే వైఖరి ఏమిటి?
డీలిమిటేషన్ విషయంలో డీఎంకే వైఖరి కూడా తమిళనాడు ప్రయోజనాల పరిరక్షణ వైపే ఉంది. తమిళనాడు లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గకూడదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. అన్నాడీఎంకే కూడా డీలిమిటేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సీఎం విజయ్ నిర్వహించిన ఎంపీల సమావేశానికి డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉన్నాయి. ఎంపీలతో మాత్రమే సమావేశం నిర్వహించకుండా అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది.

తమిళనాడు హక్కుల కోసం ఐక్యతకు పిలుపు
డీలిమిటేషన్ అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, తమిళనాడు హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడే విషయంలో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని సీఎం విజయ్ కోరారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్ష పడేలా డీలిమిటేషన్ ఉండకూడదని అన్నారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి వాయిదా వేయడం సరికాదని విజయ్ స్పష్టం చేశారు. 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం సాధించి తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.