NTV Telugu Site icon

Sandip ghosh: సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు షాక్.. సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత

Ghosh

Ghosh

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కోల్‌కతా ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.

అయితే సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ సందీప్ ఘోష్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ పిటిషన్‌లో కోరారు. శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. కోల్‌కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సీబీఐ దర్యాప్తును సమర్థించింది. దీంతో సందీప్ ఘోష్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

కోల్‌కతా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజర్షి భరద్వాజ్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 23న ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఘోష్‌.. ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఆసుపత్రి మాజీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే విచారణను కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సందీప్ ఘోష్ మరియు అతని ముగ్గురు సహచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారని ఒక అధికారిని తెలిపారు. బెలియాఘాటాలోని ఘోష్ నివాసం మరియు హౌరా, సుభాస్‌గ్రామ్‌లోని రెండు ప్రదేశాల్లో దాడులు జరిగాయి. ఉదయం 6.15 గంటలకు ఈ ప్రదేశాలకు చేరుకున్నామని.. దాడులు చేసినట్లు వెల్లడించారు. ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబరు 2023 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అతను అక్టోబర్ 2023లో RG కర్ నుంచి కొంతకాలం బదిలీ చేయబడ్డాడు. కానీ ఒక నెలలోనే తిరిగి నియమించబడ్డాడు.

Show comments