Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!

  • 70 ఏళ్ల నాటి భూ వివాదం పరిష్కారం
  • నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో కేసు ముగింపు
  • నేటితో ఫుల్‌స్టాప్ పెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం
Supermecourt

Supermecourt

హమ్మయ్య.. 70 ఏళ్ల నాటి భూ వివాదం ఈరోజుతో పరిష్కారమైంది. దాదాపు నాలుగు తరాల పోరాటానికి తెర పడింది. భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ కాలంలో మొదలైన కేసు.. ప్రస్తుత ప్రధాని మోడీ కాలంలో పరిష్కారం దొరికింది. ఈ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. అసలు ఈ కేసేంటి? దీని వెనుక కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి శనివారం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. 1957లో నమోదైన భూమి అమ్మకపు ఒప్పందం (Sale Deed) చెల్లుబాటేనని స్పష్టం చేస్తూ.. దాదాపు 70 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు పలికింది. ఈ కేసులో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం విశేషం.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా నర్సీపూర్ కలాన్ గ్రామంలో ఉన్న 15.5 బీఘాల భూమికి సంబంధించిన ఈ వివాదాన్ని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం విచారించి కీలక తీర్పు వెలువరించింది. 1957 జూన్ 4న నమోదైన అమ్మకపు పత్రం ఆధారంగా శరాఫత్ అలీ కుటుంబ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేసినట్లు కోర్టు గుర్తించింది.

వివాదం ఎలా మొదలైంది?

1957లో నమోదైన సేల్ డీడ్ ద్వారా అప్పట్లో మైనర్లుగా ఉన్న అప్పీలుదారుల కుటుంబ సభ్యులు 15.5 బీఘాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి తామే భూమిని స్వాధీనంలో ఉంచుకున్నామని వారు వాదించారు. అయితే 1984లో విక్రేతల్లో ఒకరు అభ్యంతరం ఉపసంహరించుకోవడంతో భూమిని వారి పేర్లపై మ్యూటేషన్ చేశారు. అనంతరం 1991లో భూ సమీకరణ (Consolidation) ప్రక్రియలో తమకు భూమిధార్ హక్కులు ఇవ్వాలని కోరారు. మొదట కన్సాలిడేషన్ అధికారి వారి అభ్యర్థనను అంగీకరించగా.. 1993లో కుదిరిన రాజీ కూడా వారికి అనుకూలంగా నిలిచింది. అయితే ఇతర సహ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 1999లో కన్సాలిడేషన్ అధికారి కీలక నిర్ణయం తీసుకుంటూ.. అమ్మకపు పత్రం చట్టబద్ధంగా రుజువు కాలేదని.. అలాగే యూపీ జమీందారీ రద్దు, భూ సంస్కరణల చట్టం-1950లోని సెక్షన్ 154 ప్రకారం అది చెల్లదని పేర్కొన్నారు. అనంతరం అప్పీళ్ల అధికారులు, రివిజనల్ అథారిటీ, చివరకు అలహాబాద్ హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించాయి.

సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?

కేసును సమగ్రంగా పరిశీలించిన సుప్రీంకోర్టు దిగువ కోర్టులు, కన్సాలిడేషన్ అధికారులు చట్టపరంగా స్పష్టమైన తప్పిదం చేశారని పేర్కొంది. అమ్మకపు పత్రాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి రెండు కారణాలను దిగువ కోర్టులు చూపాయని తెలిపింది. సెక్షన్ 154 ఉల్లంఘన జరిగిందని పేర్కొనడం. సాక్షి చిరునామాలో ఉన్న చిన్న వ్యత్యాసాన్ని ఆధారంగా తీసుకుని పత్రాన్ని తిరస్కరించడం. అయితే ఈ కారణాలు చట్టపరంగా సరిపోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మోసం జరిగిందని ఎలాంటి ఆరోపణలూ లేవు

ప్రతివాదులు ఎక్కడా ఈ అమ్మకపు పత్రం నకిలీదని, బలవంతంగా రాయించుకున్నదని, మోసం లేదా వేషధారణ ద్వారా తీసుకున్నదని ఆరోపించలేదని కోర్టు పేర్కొంది. ‘‘చట్టబద్ధంగా నమోదైన అమ్మకపు పత్రానికి చెల్లుబాటు అవుతుందనే న్యాయపరమైన అంచనా ఉంటుంది. అలాంటి పత్రాన్ని చిన్న చిన్న సాంకేతిక లోపాల ఆధారంగా తిరస్కరించలేం.’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

70 ఏళ్ల పోరాటానికి ముగింపు

అప్పీలుదారులు ఎప్పటి నుంచో భూమి తమ ఆధీనంలో ఉందని చెబుతుండగా.. దాన్ని ప్రతివాదులు సమర్థవంతంగా ఖండించలేకపోయారని సుప్రీంకోర్టు పేర్కొంది. నమోదైన అమ్మకపు పత్రం, దానికి ఉన్న చట్టబద్ధత, మోసం లేదా నకిలీ ఆరోపణలు లేకపోవడం, సాక్షి వాంగ్మూలంలో ఎలాంటి కీలక వైరుధ్యాలు బయటపడకపోవడం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దిగువ కోర్టుల తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెరపడింది. నాలుగు తరాలుగా సాగిన న్యాయపోరాటానికి చివరికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. మొత్తానికి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో మొదలైన కేసు.. ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ కాలంలో సమాప్తమైంది.