Site icon NTV Telugu

UGC rules: కులాల పేరుతో సమాజాన్ని విభజిస్తారా.? UGC నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే..

Ugc

Ugc

UGC rules: యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ గ్రాంట్ కమిషన్(UGC) 2016 రూల్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి అమలుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ రూల్స్ అస్పస్టంగా ఉన్నాయని, సమాజాన్ని విభజించే అవకాశం ఉందని, దుర్వినియోగానికి తావిచ్చే అవకాశం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్రం, యూజీసీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉండవని స్పష్టం చేసింది.

వివాదం ఏంటి..?

కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ ఉన్నత విద్యాసంస్థలో ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇవి వివక్షకు సంబంధించిన ఫిర్యాదుల్ని పరిశీలించడంతో పాటు సామరస్య వాతావరణాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ కమిటీల్లో ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, దివ్యాంగులు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే , జనరల్ కేటగిరి విద్యార్థలకు ఈ ఫిర్యాదు వ్యవస్థను విస్తరించకపోవడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇది సమాన హక్కుల సూత్రానికి విరుద్ధమని పిటిషన్లు వాదించారు. విద్యార్థుల మధ్య వైరాన్ని పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు:

కొత్త యూజీసీ 2026 రూల్స్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేకపోతే, ఇవి సమాజాన్ని విభజించే ప్రమాదం ఉందని, నిబంధనల భాష అస్పష్టంగా ఉందని, నిపుణులు వీటిని సరిచూడాలని కోరింది. జస్టిస్ బాగ్చి యూనివర్సిటీల్లో స్వేచ్చాయుత, సమాన వాతావరణం అవసరమని చెప్పారు. అలాగే ర్యాగింగ్ అంశాన్ని ఈ నిబంధనల్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా భారతదేశం కులరహిత సమాజం దిశగా కాకుండా, వెనక్కి వెళ్తుందా.? అని వ్యాఖ్యానించింది. 75 ఏళ్ల కులరహిత సమాజం దిశగా మనం సాధించిన పురోగతిని ఇప్పుడు కోల్పోతున్నామా? అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. కులరహిత సమాజం వైపు మనం కదలాలని, అవసరమైన వారికి రక్షణ ఉండాలి, కానీ విభజనకు దారితీసే వ్యవస్థ ఉండకూడదని అన్నారు.

ఒకప్పుడు అమెరికాలో వర్ణ ఆధారిత వేరే వేరు స్కూల్స్ ఉన్న విధానాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ.. ఇలాంటి పరిస్థితి లోకి భారత్ వెళ్లకూడదని, విద్యా సంస్థలు భారత ఐక్యతను ప్రతిబింబించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్ వర్గాల్లో కూడా అసమానతలు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కొన్ని ఎస్సీ ఉప వర్గాలు ఇతరుల కంటే ఎక్కువ లాభాలు పొందుతున్నాయని, అందుకే కొన్ని రాష్ట్రాలు ఎస్సీలను గ్రూప్ ఏ, గ్రూప్ బీగా విభజిస్తున్నాయని చెప్పింది. యూజీసీ నిబంధనలను సమగ్రంగా పరిశీలించేందుకు నిపుణులు, విద్యావేత్తలతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది.

Exit mobile version