Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!

  • పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు
  • నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
  • కేంద్రానికి కీలక సూచనలు చేసిన న్యాయస్థానం
Supremecourt

Supremecourt

పిల్లలకు ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా వయసు ఆధారంగా ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇంటర్నెట్‌ను పొందడం, వినియోగించడం పిల్లలకు కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ అవసరమని పేర్కొంది. పిల్లల భద్రతను కాపాడుతూనే వారి హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నెట్‌, సోషల్ మీడియా వేదికలకు సూచించింది.

పిల్లల భద్రత, వారి స్వేచ్ఛ పరస్పర విరుద్ధమైన అంశాలు కావని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు ఇంటర్నెట్‌ ప్రాప్యతను పూర్తిగా నిరాకరించడం సమంజసం కాదని పేర్కొంది. భద్రత పేరుతో వారి ప్రాథమిక హక్కులను తొలగించకూడదని స్పష్టం చేసింది. వయసు ఆధారంగా కఠినమైన ఆంక్షలు విధిస్తే పిల్లలు నియంత్రణ లేని, మరింత ప్రమాదకరమైన వెబ్‌సైట్ల వైపు వెళ్లే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో ఎవరైనా పిల్లలను ప్రలోభపెట్టినా, బెదిరించినా.. ఆంక్షలను ఉల్లంఘించామని తల్లిదండ్రులు శిక్షిస్తారనే భయంతో వారు జరిగిన విషయాన్ని చెప్పకపోవచ్చని అభిప్రాయపడింది. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ ఆన్‌లైన్‌లో కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులను రక్షించడంలో నియంత్రణ సంస్థలు, సోషల్ మీడియా వేదికలు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీడైరెక్ట్ లింకులు, వెబ్‌సైట్ల ద్వారా పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను చెల్లింపు ప్రమోషన్ల రూపంలో ప్రచారం చేస్తున్నారనే నివేదికలు కూడా ఈ విచారణకు కారణమయ్యాయి.

ప్రస్తుతం ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థ ప్రధానంగా వ్యక్తిగత ఫిర్యాదులపైనే ఆధారపడుతోందని కోర్టు పేర్కొంది. ఒక ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను గుర్తించి తొలగించినా.. అదే కంటెంట్ ఇతర వేదికల్లోనూ ఉందని ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థ లేదని తెలిపింది. దీంతో కంటెంట్ తొలగింపులో జాప్యం జరిగి, అది మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. ఈ విషయంలో సమర్థమైన చర్యల కోసం అధికారులు, ప్లాట్‌ఫామ్‌లు మరింత కాలం తీసుకోవడాన్ని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది.

పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నెట్‌, సోషల్ మీడియా సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కంటెంట్‌కు సంబంధించిన పెర్సెప్చువల్ హ్యాష్‌లు, వెబ్‌ చిరునామాలతో కూడిన జాతీయ డేటాబేస్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనివల్ల ఒకే కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్‌లలో గుర్తించడం, సమన్వయంతో తొలగించడం సులభమవుతుందని పేర్కొంది.

పిల్లలకు ఆన్‌లైన్ ప్రమాదాలపై ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆన్‌లైన్‌లో ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులను గుర్తించడం, అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దల సహాయం కోరడం వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. పిల్లలపై ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఆ పేరుతో వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్ వేగంగా తొలగించడంతో పాటు, తప్పుగా కంటెంట్ తొలగించే చర్యలను నివారించే వ్యవస్థలు కూడా ఉండాలని సూచించింది. పిల్లలకు ఇంటర్నెట్‌ను పూర్తిగా దూరం చేయడం కాకుండా.. దాన్ని సురక్షితంగా వినియోగించేలా అవగాహన కల్పించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, వారి హక్కులను కాపాడటం ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కోర్టు అభిప్రాయపడింది.