The Lancet Report: ఇటీవల కాలంలో భారతదేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాల్లో చిన్నచిన్న కారణాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఇండియాలో జరుగుతన్న ఆత్మహత్యలపై ది లాన్సెట్ రీజినల్ హెల్త్ నివేదిక కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం దేశంలో స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఆత్మహత్యల రేటు 2.6 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. గత ఏడేళ్లలో భారతీయ పురుషుల ఆత్మహత్యల మరణాల కేసులు మూడింట ఒక వంతుకు పైగా పెరిగాయని ది లాన్సెట్ రీజినల్ హెల్త్ నివేదిక పేర్కొంది.
2014లో 42,521 మంది మహిళలు, 89,129 మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. 2021లో ఈ నిష్పత్తి 2.64 రెట్లు పెరిగింది. 2021లో పురుషులు 1,18,97 ఆత్మహత్యలకు పాల్పడితే.. స్త్రీలు 45,026 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో వివాహిత పురుషుల్లో ఆత్మహత్య మరణాల రేటు మూడు రెట్లు నమోదైంది. లక్ష మరణాలకు పోల్చి చూసినప్పుడు పురుషుల ఆత్మహత్య రేటు 24.3 శాతం ఉంటే , స్త్రీలది 8.4 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది.
Read Also: Jharkhand: మనుషుల పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయలు..
కారణాలు ఇవే..
భారతదేశంలో మారుతున్న ఆత్మహత్యల తీరుపై జరిగిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పురుషులు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ రెండింటి కారణంతోనే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తేలింది. మహిళల్లో ఆత్మహత్యలు తక్కువగా ఉండటానికి కోపింగ్ మెకానిజం కారణం కావచ్చని నివేదిక అంచనా వేసింది.
ఈ రెండు కారణాల వల్ల 2014-2021లో ఆత్మహత్యల స్త్రీ-పురుష నిష్ఫత్తి 1.9, 2.5 నుంచి 2.4 , 3.2 శాతానికి పెరిగింది. 2014-2021 మధ్య కాలంలో ఆత్మహత్యలకు కుటుంబ సమస్యల్ని కారణంగా చూపడం 107.5 శాతం పెరిగింది. ఇది మహిళలతో పోలిస్తే దాదాపు 2 రెట్లు అధికం అని నివేదిక తెలిపింది. ఆత్మహత్యల రేటు 30-44 ఏళ్ల వాళ్లలో ఎక్కువగా 27.2 శాతం ఉంది. ఇది 2014లో 22.7 శాతం ఉంటే 2021లో 27.2 శాతంగా ఉంది. 18-29 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఆత్మహత్యల రేటు 2014లో 20 ఉంటే, 2021లో 25.6 శాతానికి పెరిగింది.
మొత్తం మీద 2014 నుంచి 2021 మధ్యకాలంలో భారతీయ పురుషుల్లో ఆత్మహత్యల మరణాల కేసులు 33.5 శాతం పెరిగాయి. దాదాపుగా 5.89 శాతం పెరిగింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే రోజూవారీ కూలీ కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. రోజువారీ కూలీ పనిలో నిమగ్నమైన పురుషులలో ఆత్మహత్య ద్వారా మరణించిన కేసులు 2014లో 13,944 ఉంటే 2021లో ఇది 37, 751కి పెరిగాయి. మహిళల్లో కూడా పెరుగుదల కనిపించింది.